ఇంటర్‌ పరీక్షలపై పరేషాన్‌

ప్రధానాంశాలు

ఇంటర్‌ పరీక్షలపై పరేషాన్‌

ప్రథమ సంవత్సరానికి ఉంటాయని ప్రకటించి 20 రోజులు

ఇప్పటివరకూ కాలపట్టిక ప్రకటించని ప్రభుత్వం

4.74 లక్షల మంది విద్యార్థుల్లో గందరగోళం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తాం.. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి’’ అని ప్రకటించిన ప్రభుత్వం.. పరీక్షల కాలపట్టిక ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా దాదాపు 4.74 లక్షల మంది విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా గత మే నెలలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. రెండో ఏడాది విద్యార్థులకు మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ఇచ్చారు. తొలి ఏడాది విద్యార్థులను రెండో సంవత్సరంలోకి ప్రమోట్‌ చేస్తున్నామని, పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 15న విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలు తప్పకుండా ఉంటాయని, త్వరలోనే కాలపట్టిక ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించి 20 రోజులు గడిచింది. కానీ దాని ఊసే లేదు. పరీక్షల ప్రారంభానికి 15 రోజులు ముందుగా కాలపట్టికను ప్రకటించాలి. ప్రభుత్వం పునరాలోచనలో పడటం వల్లే కాలపట్టిక ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. ముమ్మరంగా ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నందున, ఇప్పుడు పరీక్షలు జరిపితే రెండో ఏడాది తరగతులకు నష్టం జరుగుతుందని, అందుకే పరీక్షలకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ఉన్నట్లు తెలిసింది.

పరీక్షలు జరిపితే సమస్యలు ఇవీ

ప్రతిరోజూ పరీక్షలు జరిపినా కనీసం వారం రోజులు పడుతుంది. ఆ సమయంలో తరగతులు నిర్వహించడం కుదరదు. పరీక్షలకు 15 రోజుల ముందు సన్నద్ధత కోసం సెలవులివ్వాలి. జవాబుపత్రాల మూల్యాంకనానికి కనీసం 10-15 రోజులు అధ్యాపకులను పంపాలి. పరీక్షలో తప్పితే వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ జరపడం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. వచ్చే మార్చి/ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలప్పుడు నిర్వహిస్తే అప్పుడు మరింత ఒత్తిడికి లోనవుతారన్న అభిప్రాయాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులివ్వొచ్చు

‘‘అసైన్‌మెంట్లు, అంతర్గత పరీక్షలు జరిపితే వార్షిక పరీక్షలు జరగని పరిస్థితుల్లో వాటి ఆధారంగా మార్కులు ఇవ్వొచ్చు. ఇప్పుడు పరీక్షలంటే నెల రోజులు విద్యాసంవత్సరం వృథా అవుతుంది’’ అని తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్‌ రామకృష్ణగౌడ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పరీక్షల పేరిట తరగతులు లేకుండా చేయడం వల్ల నష్టం జరుగుతుంది’ అని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇంటర్‌ మార్కుల ఆధారంగా వృత్తి విద్యా కళాశాలల్లో సీట్లు కేటాయించడం లేదని గుర్తుంచుకోవాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని