నాణ్యమైన బియ్యమే కొంటాం

ప్రధానాంశాలు

నాణ్యమైన బియ్యమే కొంటాం

రేషన్‌కార్డులపై తృణధాన్యాలు పంపిణీ చేయాలి

అప్పుడే ఆ పంటలను కేంద్రం కొంటుంది

జాతీయ తృణధాన్యాల సదస్సులో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. అందుకే అలాంటి బియ్యాన్ని మాత్రమే కేంద్రం కొంటుంది’’ అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు. ‘ఉప్పుడు(బాయిల్డ్‌) బియ్యాన్ని కేంద్రం ఎందుకు కొనదు, తెలుగు రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు ఆందోళనలో ఉన్నారు కదా’ అని ‘ఈనాడు’ అడుగగా.. దొడ్డు బియ్యం కొనేది లేదని ఆయన తెలిపారు.  ‘పేదలకు పోషకాహారం అందించేందుకు తృణధాన్యాలను రేషన్‌ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తే.. ఈ పంటలను రైతుల నుంచి మద్దతు ధరకు కేంద్రం కొంటుంది’ అని స్పష్టం చేశారు. రేషన్‌ కార్డులపై విక్రయిస్తే సజ్జలను కిలో రూపాయికే ఇస్తామని మంత్రి వివరించారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో శుక్రవారం ‘జాతీయ పోషక తృణధాన్యాల భాగస్వాముల మెగా సదస్సు’కు తోమర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రజలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి. రాగులు, సజ్జలు, కొర్రలు తదితర తృణధాన్యాల్లో ఎన్నో పోషక విలువలున్నందున వాటిని ప్రజలకివ్వాలి.   పేదలకు రేషన్‌కార్డులపై అందించి వారికి పోషకాహారం అందేలా చూడటంలో ప్రభుత్వాలు జవాబుదారీగా పనిచేయాలి. ఈ పంటలు పండించే రైతులను ప్రోత్సహించి ఉత్పత్తులు పెంచాలి. ఈశాన్య, తెలుగు రాష్ట్రాల్లో భూములు, వాతావరణం ఆయిల్‌పాం సాగుకు అనుకూలం. ఈ పంట సాగును, పామాయిల్‌ ఉత్పత్తిని కేంద్రం ప్రోత్సహిస్తోంది. తత్ఫలితంగా తెలంగాణ రైతులకు ఆదాయం పెరుగుతుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ సదస్సులో తృణధాన్యాల పంటల సాగు, ఆహారోత్పత్తుల పెంపు, పంటల శుద్ధికి ఏం చేయాలో చర్చించి ప్రతిపాదనలు పంపితే కేంద్రం వాటితో ప్రణాళిక రూపొందిస్తుంది’’ అని తోమర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ రాజేంద్రనగర్‌ పరిశోధన స్థానంలో కేంద్ర మంత్రి తోమర్‌ను కలిశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ పెంపకాన్ని చేపడుతున్నందున, విత్తనాల దిగుమతికి కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ను సీఎస్‌ కోరారు.


ఆకట్టుకున్న తృణధాన్యాల ఉత్పత్తులు

హైటెక్స్‌ హాలులో వివిధ సంస్థలు తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారోత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. సజ్జలతో లడ్డూలు, కేక్‌లు, జొన్న బిస్కట్లు, రాగులతో ఆహారోత్పత్తులను రుచికరంగా తయారుచేసి ప్రదర్శనలో ఉంచాయి. కేంద్ర మంత్రి తోమర్‌ అన్ని స్టాళ్ల వద్దకు వెళ్లి ఉత్పత్తుల తయారీ గురించి అడిగారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని