రాష్ట్రంలో పోడు భూముల విస్తీర్ణం ఎంత?

ప్రధానాంశాలు

రాష్ట్రంలో పోడు భూముల విస్తీర్ణం ఎంత?

స్పష్టమైన వివరాలివ్వాలని అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం సూచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజనుల అధీనంలోని పోడు భూముల విస్తీర్ణంపై స్పష్టమైన గణాంకాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు సూచించింది. గిరిజన సంక్షేమశాఖవద్ద అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై పొరుగు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయనుంది. పోడు భూముల అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో జరిగిన సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టీనా, అటవీశాఖ ప్రధాన సంరక్షకురాలు శోభ హాజరయ్యారు. పోడు భూములు, అటవీ విస్తీర్ణం, అటవీహక్కుల చట్టంపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలో 2011 నాటికి 6.5 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన దరఖాస్తుల్లో 3 లక్షల ఎకరాలకు సంబంధించి పరిష్కారమయ్యాయని అధికారులు గుర్తించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టంలోని కటాఫ్‌ తేదీకి తర్వాత వచ్చిన దరఖాస్తులపై చర్చ జరిగింది. వీటిపై ఏపీ, ఇతర రాష్ట్రాల తరహాలో కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద గిరిజన సంక్షేమశాఖకు వచ్చిన దరఖాస్తుల్లోని విస్తీర్ణం, అటవీశాఖ చెబుతున్న విస్తీర్ణానికి భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది. పోడు పేరిట గిరిజనేతరులు అటవీ భూములను ఆక్రమిస్తున్నట్లు ఉపసంఘం దృష్టికి వచ్చింది. ఈ నెల 24న మరోసారి సమావేశం కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని