దత్తత నిబంధనల్లో మార్పులు

ప్రధానాంశాలు

దత్తత నిబంధనల్లో మార్పులు

విదేశీయులకు అవసరమయ్యే నిరభ్యంతర పత్రాలు ‘కారా’ ద్వారా జారీ

దిల్లీ: మన దేశంలో దత్తత తీసుకున్న చిన్నారులను విదేశాలకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతులను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసింది. హిందూ దత్తతలు, పోషణ చట్టం (హామా)కు చేసిన సవరణల ప్రకారం.. బిడ్డ దత్తత తల్లిదండ్రులు నిరభ్యంతర పత్రాన్ని ఇకపై కేంద్ర దత్తత కల్పన ప్రాధికార సంస్థ(కారా) నుంచి పొందవచ్చు. హామా చట్టం దేశంలోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన మతస్తులకు వర్తిస్తుంది. ఈ చట్టం ద్వారా దత్తత వెళ్లిన బిడ్డలు కూడా కన్నబిడ్డల మాదిరిగానే పూర్తి హక్కులను పొందుతారు. అయితే, వీరిని దత్తత పొందిన విదేశీ తల్లిదండ్రులు తమ దేశానికి తీసుకెళ్లాలంటే ఇప్పటి వరకూ న్యాయస్థానాల ద్వారా నిరభ్యంతర పత్రాలను పొందాల్సి ఉండేది. ఇప్పుడు దీనిని సడలిస్తూ సంబంధిత ఉత్తర్వులను కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి జారీ చేసింది. హేగ్‌ దత్తత ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు అవసరమైన నిరభ్యంతర పత్రాలను కారా జారీ చేస్తుంది. అయితే, దీనికన్నా ముందు ఆ దత్తత తల్లిదండ్రులు...బిడ్డ నివాసం ఉండే జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి వెరిఫికేషన్‌ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది.

హేగ్‌ దత్తత ఒప్పందం వెలుపల ఉన్న దేశాలకు చెందిన దత్తత తల్లిదండ్రులు అయితే..వారి సొంత దేశ ప్రభుత్వం నుంచి పొందిన అనుమతి పత్రాన్ని కారాకు అందజేయాల్సి ఉంటుంది. హామా నిబంధనల ప్రకారం దత్తత తీసుకున్న చిన్నారులను విదేశాలకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నందున నిబంధనల్లో తాజా మార్పులు అవసరమయ్యాయని మహిళ, శిశు అభివృద్ధి శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని