తప్పు చూపితే సహించని స్థితిలో పాలకులు: నిఖిలేశ్వర్‌

ప్రధానాంశాలు

తప్పు చూపితే సహించని స్థితిలో పాలకులు: నిఖిలేశ్వర్‌

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగానూ ప్రస్తుతం రచయితలు పాలకులనుంచి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్‌ పేర్కొన్నారు. తప్పులను ఎత్తిచూపితే సహించలేని స్థితిలో పాలకులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన తాను రాసిన అగ్నిశ్వాస పుస్తకానికి ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు- 2020ని సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబార్‌ నుంచి అందుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సమకాలీన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజలపట్ల బాధ్యత ఉన్న రచయితలు, కవులు ప్రస్తుతం అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు. బుద్ధిజీవుల్లోనూ ఆశలురేపి ప్రభుత్వాలు మాయలో పడేస్తున్నాయి. దీనిపై అప్రమత్తమవుతూ మరింత క్రియాశీలం కావాల్సి ఉంది. పర్యావరణాన్ని, ప్రజాఉద్యమాలను నిరంతరం కాపాడాలి’ అని సూచించారు. 1938 ఆగస్టు 11న తెలంగాణలోని యాదాద్రి జిల్లా వీరపల్లిలో నిఖిలేశ్వర్‌ (యాదవరెడ్డి) జన్మించారు. నిఖిలేశ్వర్‌ అనే కలం పేరుతో రచనలు కొనసాగిస్తూ.. ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరిగా, ప్రముఖ రచయితగా గుర్తింపు పొందారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో రచనలు చేశారు. 30కిపైగా పుస్తకాలు ప్రచురించారు. అందులో జ్ఞాపకాల కొండ, గోడల వెనుక, నిఖిలేశ్వర్‌ కథలు, మారుతున్న విలువలు, మరో భారతదేశం, ఆకాశం శాంతం, కథల వారధి పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని