గద్దెనెక్కని ప్రతిపాదనలు

ప్రధానాంశాలు

గద్దెనెక్కని ప్రతిపాదనలు

మేడారం మహాజాతరకు 5 నెలలే గడువు

విడుదలకాని నిధులు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి, న్యూస్‌టుడే: రెండేళ్లకోసారి ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. అధికారులు, నేతలు మాత్రం జాతర నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పనులు ప్రారంభిస్తేనే జాతర సమయంలో భక్తులు సౌకర్యవంతంగా అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి జాతరను 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహిస్తామని మేడారం పూజారుల సంఘం ఏప్రిల్‌ 25న ప్రకటించింది. పది నెలల సమయం ఉండగానే తేదీలను ప్రకటించినా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈసారి జాతరకు కోటి మందికి పైగా వస్తారని అంచనా.

జాతర అభివృద్ధి, ఏర్పాట్లకు సంబంధించి పనులు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటి వరకు సమావేశమే నిర్వహించలేదు. ఇలా రూపొందించిన జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. దాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల అనంతరం ముఖ్యమంత్రి అనుమతితో శాఖలవారీగా నిధులు మంజూరు చేస్తారు. వాటి ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుంది.

ఎప్పుడూ హడావుడి పనులే....

జాతరలో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్‌ పాయింట్లు, ట్రాఫిక్‌ సంకేతాలు, డంప్‌యార్డుల నిర్మాణాలు, విద్యుత్తు, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. సకాలంలో పనులు చేపడితే పనులను నాణ్యతతో చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది. చివరి రెండు, మూడు నెలలు ఉందనగా నిధులు కేటాయించడంతో పనుల్లో నాణ్యత లోపిస్తుంది. 

నెరవేరని రూ.200 కోట్ల హామీ..

2018లో జరిగిన మహాజాతరకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారం అభివృద్ధికి రూ.200 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి, శాశ్వత నిర్మాణాల కోసం 100 నుంచి 500 ఎకరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. గతేడాది 50 ఎకరాల వరకు సేకరించారు. నిధులు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు.

* జాతరకు వాహనాలతో ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతుంటుంది. ముఖ్యంగా తాడ్వాయి-మేడారం, పస్రా-మేడారం రహదారులను నాలుగు వరసల రహదారిగా చేస్తే ట్రాఫిక్‌ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కొండాయి-ఊరట్టం రహదారి చేపడితే ఖమ్మం ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు రవాణా సులభమవుతుంది.

* జంపన్నవాగుపై ఊరట్టం వైపు అర కిలోమీటరు వరకు స్నానఘట్టాలు నిర్మిస్తే భూములు కోతకు గురికాకుండా చూడవచ్చు. కొట్టుకుపోయిన వంతెన పునఃనిర్మాణం చేపట్టాలి.

* ఆలయ విస్తరణ చేపట్టాల్సి ఉంది. గద్దెలు అలాగే ఉంచి, శాలహార ప్రాంగణం విస్తరించాలి.

* శాశ్వత మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రస్తుతానికి నాలుగు చోట్లే ఉన్నాయి.

* తాగునీటి కోసం ఏర్పాటు చేస్తున్న నల్లాలకు ఆన్‌ఆఫ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

త్వరలో సమావేశం నిర్వహిస్తాం

ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. వర్షం, వరదల కారణంగా వాయిదా వేశాం. మంత్రులు దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, వివిధ శాఖల అధికారులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం.

- కృష్ణ ఆదిత్య, కలెక్టర్‌, ములుగు జిల్లా

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని