కనీసం కన్నుగప్పి!

ప్రధానాంశాలు

కనీసం కన్నుగప్పి!

చ.అ. అద్దె రూ.50గా నిర్ణయించి రూ.35కే కేటాయింపు

రాజకీయ ఒత్తిళ్లే కారణం

మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయ భవనం లీజులో అక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ(మహిళా కార్పొరేషన్‌) కార్యాలయ భవనం లీజులో మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కన్నా తక్కువ ధరకు బిడ్లు దాఖలైనప్పటికీ ఆమోదించిన విషయం తాజాగా వెలుగుచూసింది. టెండరు నిబంధనల ప్రకారం కనీస అద్దె కన్నా తక్కువకు బిడ్లు వచ్చినపుడు వాటిని అధికారులు రద్దు చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలోని మహిళా కార్పొరేషన్‌కు చెందిన ఈ భవనాన్ని వాణిజ్య అవసరాల కోసం అతితక్కువ ధరకే అప్పగించిన విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకువచ్చింది. మహిళా సాధికారత, శిక్షణ, వర్కింగ్‌ ఉమెన్‌ వసతి కోసం కేటాయించిన ఈ భవనాన్ని వాణిజ్య సంస్థల వ్యాపార అవసరాలకు వినియోగించాలని మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనంలోని శిక్షణ కేంద్రాన్ని, కార్యాలయాన్ని అమీర్‌పేటకు తరలించిన మహిళా కార్పొరేషన్‌... ఆదాయం కోసం వాణిజ్య అవసరాలకు కేటాయించేందుకు వీలుగా 2021 ఫిబ్రవరి 2న టెండర్లు పిలిచింది. చదరపు అడుగు(చ.అ.)కు కనీస అద్దెను రూ.50గా ఖరారు చేసింది. ఈ మొత్తం కన్నా ఎక్కువ ధరకు వచ్చిన బిడ్లు పరిశీలిస్తామని తెలిపింది. అయితే కరోనా సమయంలో విస్తృతమైన ప్రచారం లేకపోవడంతో బిడ్లు రాలేదు. మరోసారి ప్రకటనలు ఇచ్చిన తరువాత కనీస అద్దె కన్నా తక్కువ ధరకు మూడు బిడ్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడుతున్నందున మరోసారి టెండర్లు పిలిచి అధిక ధరలకు అప్పగించేలా బిడ్లు స్వీకరించకుండా... తక్కువ ధరకే వచ్చిన బిడ్లను మహిళా కార్పొరేషన్‌ పరిశీలించింది. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన బిడ్ల పరిశీలనపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేసినట్లు సమాచారం. దీంతో మూడు బిడ్లలో తక్కువగా వచ్చిన రూ.35 బిడ్‌ను ఆమోదించినట్లు తెలిసింది. అంతకంటే తక్కువగా రూ.25, రూ.20 చొప్పున మిగతా రెండు అంతస్తులను లీజుకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని