కన్నీళ్లు పెట్టిస్తున్న బత్తాయి!

ప్రధానాంశాలు

కన్నీళ్లు పెట్టిస్తున్న బత్తాయి!

  రైతుకు నష్టాలు తెస్తున్న పంట

  మూడు నెలల్లో రూ.75 వేల నుంచి రూ.20 వేలకు తగ్గిన ధర

  మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి ముంచెత్తుతున్న దిగుబడులు

ఈనాడు, హైదరాబాద్‌, గుర్రంపోడు, న్యూస్‌టుడే: బత్తాయి మార్కెట్‌లో అస్థిరత రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నాణ్యమైన బత్తాయిలు పండిస్తున్నా మార్కెటింగ్‌ అవకాశాలు సరిగా లేక ధరలు ఎప్పుడెలా ఉంటాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పంట బాగా పండి అధికంగా కోతకొచ్చే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ధరలు తగ్గించేస్తూ వ్యాపారులు మార్కెట్‌ను శాసిస్తున్నారు. బత్తాయిలకు కీలకమైన హైదరాబాద్‌ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో గత మే, జూన్‌ నెలల్లో టన్ను బత్తాయిల గరిష్ఠ ధర రూ.70 వేల నుంచి రూ.75 వేలుగా ఉంది. ఇప్పుడు నాణ్యమైన ఒకటీ, రెండు టన్నులకు రూ.19 వేలు ఇచ్చి మిగతా పంటనంతా రూ.9 వేల నుంచి రూ.15 వేేలకే కొంటున్నారు. మరోపక్క మార్కెట్లలో వ్యాపారులు కమీషన్ల దందా 8 నుంచి 10 శాతం దాకా ఉండటం రైతులను మరింత నష్టపరుస్తోంది. సీ విటమిన్‌ వంటి పోషకాలు మిన్నగా గల ఈ పంటకు మద్దతుధరను ప్రకటించాలని రాష్ట్ర ఉద్యానశాఖ గతంలో కేంద్రానికి విన్నవించినా స్పందనే లేదు. డీజిల్‌, కూలీరేట్లు పెరగడం వల్ల పంట సాగు ఖర్చులు పెరుగుతుంటే మార్కెట్లో బత్తాయి ధర తగ్గుతూ వస్తుండటంతో రైతులు నష్టాల బారినపడుతున్నారు.

మన మార్కెట్లోకి మహారాష్ట్ర సరకు

రాష్ట్ర మార్కెట్లోకి మహారాష్ట్ర బత్తాయి బాగా వస్తుండటంతో ఇక్కడి పంటకు ధర తగ్గించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తోటలు లీజుకు తీసుకునే వ్యాపారులు మాత్రం ప్రస్తుతం టన్నుకు రూ.పదివేలలోపే ధర చెల్లిస్తామని అడుగుతున్నారు. అంత తక్కువకు ఇవ్వలేక రైతులు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు తెలంగాణ రైతులు దిల్లీకి నేరుగా పంటను తీసుకెళ్లి అమ్ముకున్నా రవాణా ఖర్చు అధికంగా వస్తుండటంతో ఏం మిగలడం లేదని తెలిపారు. మద్దతుధర ఇచ్చి ఆదుకోకపోతే సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఈ పంట సాగు కనుమరుగవుతుందని బత్తాయి రైతుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా నాయకుడు చిలుక విద్యాసాగర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో సాగయిన బత్తాయి తోటలు ప్రస్తుతం 90 వేల ఎకరాలకు పడిపోయింది. ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనే ఈ సాగు విస్తీర్ణం అధికంగా ఉంది.


ఇతర రాష్ట్రాల పంటతో ధరల పతనం

మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి బత్తాయి పంట దిగుబడులు ఎక్కువగా వస్తున్నందున ధరలు పతనమవుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో సగం మంది కూడా బత్తాయిలు తినడం లేదు. శరీరానికి సీ విటమిన్‌ అందించే బత్తాయిల ధరలు తక్కువగా ఉన్నందున రోజూ వాటి రసం తాగితే అమ్మకాలు పెరిగి రైతులకు మంచి ధర వస్తుంది.

ఎల్‌.వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు,తెలంగాణ ఉద్యానశాఖ


పంట రాలిపోతోంది

నేను 3 ఎకరాల్లో పంట వేశాను. ప్రస్తుతం పంట విరగకాసింది. మార్కెట్లో ధరలేకపోవడంతో కోత కోయించడంలేదు. దీంతో పంట రాలిపోతోంది. 

కట్టా శ్రీనివాస్‌, కట్టావారిగూడెం, గుర్రంపోడు మండలం, నల్గొండ జిల్లా


రూ.20 వేలు వస్తేనే గిట్టుబాటు

నాకు గతంలో 8 ఎకరాల బత్తాయి తోట ఉండేది. నష్టాలు, ఖర్చులు భరించలేక ఇప్పుడు 4 ఎకరాలకు తగ్గించాను. టన్నుకు రూ.20 వేలు వస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది.

మల్లు నాగార్జున్‌రెడ్డి, మల్కపట్నం, వేములపల్లి మండలం, నల్గొండ జిల్లా


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని