దవాఖానాల్లో దాతృత్వ పరిమళాలు

ప్రధానాంశాలు

దవాఖానాల్లో దాతృత్వ పరిమళాలు

 సర్కారీ ఆసుపత్రులకు ఉదారంగా విరాళాలు

నిస్వార్థ వితరణతో పదుగురికీ ఆదర్శం

సమకూరుతున్న అత్యాధునిక సౌకర్యాలు

ఈనాడు - హైదరాబాద్‌

ర్కశ కరోనా... కష్టాలకు చిరునామా. వ్యక్తులు, వ్యవస్థలను అతలాకుతలం చేసిందా మహమ్మారి. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చితికిపోయాయి. అనేక వ్యవస్థలు ఇంకా దయనీయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు చాలక అవస్థలు పడడం చూశాం.

ఇటువంటి కష్టకాలంలోనూ మానవత్వం పరిమళించింది. విరాళాలుగా వికసించింది. వ్యక్తులు, సంస్థలు తోచినసాయంతో తోటివారిని ఆదుకున్నాయి. కొందరు వ్యక్తులు, స్వచ్ఛంద, కార్పొరేట్‌ సంస్థల వారు ఆసుపత్రులకు ఊతమివ్వడానికి ముందుకొచ్చారు. రూ. వేలు, లక్షలు, కోట్లు... ఇలా ఎవరి స్థాయి మేరకు వారు వితరణ చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల వంటి చిన్న వస్తువుల నుంచి... వెంటిలేటర్లు, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌ వంటి అత్యవసర పరికరాల వరకూ వితరణగా అందించారు. మరికొందరు ఆర్‌వో ప్లాంట్లు, బహుళ అంతస్తుల భవనాలతోపాటు వాటిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. కొవిడ్‌కు ముందే వితరణ చేసిన పలు సదుపాయాలూ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి ఔదార్యాన్ని మరికొందరు దాతలూ అందిపుచ్చుకుంటే సర్కారీ దవాఖానాల దశ మార్చడం కష్టం కాదు.


 ప్రాణరక్షణ పరికరాలిచ్చారు
- డాక్టర్‌ నాగేందర్‌, సూపరింటెండెంట్‌, ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి

వివిధ పారిశ్రామిక, స్వచ్ఛంద సంస్థలు రోగుల ప్రాణాలను నిలిపే విలువైన యంత్ర పరికరాలు విరాళంగా ఇస్తున్నాయి. గ్లాండ్‌ ఫార్మా సుమారు రూ.80 లక్షల విలువైన పరికరాలిచ్చింది. మూత్రపిండాల మార్పిడికి బాగా ఉపయోగపడే సీఆర్‌ఆర్‌టీ యంత్రం కూడా ఇందులో ఉంది. రోటరీ క్లబ్‌ హైదరాబాద్‌ తూర్పు విభాగం వారు హెటిరో సంస్థతో కలిసి రూ.50 లక్షల విలువైన ‘చర్మ బ్యాంకు’ను నెలకొల్పారు. మిథానీ సంస్థ రూ.50 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంటు, షెడ్డు నిర్మించనుంది. సైఫ్‌ బైతుల్‌మా సంస్థ, భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి వేర్వేరుగా ఆర్వో ప్లాంట్లు నిర్మించి ఇచ్చాయి.


 అధునాతన ఆసుపత్రి నిర్మాణం
- డాక్టర్‌ జయలత, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి

అరబిందో సంస్థ వితరణ చేస్తున్న అధునాతన భవనం, ఆధునిక పరికరాలు క్యాన్సర్‌ రోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. బీడీఎల్‌ సంస్థ రూ.కోటి విలువైన మైక్రోబయాలజీ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసింది. రోగుల వసతి కోసం రూ.1.5 కోట్లతో సత్రం కూడా నిర్మిస్తోంది. పిల్లల క్యాన్సర్‌ విభాగంలో నీనారావు ఛారిటబుల్‌ ట్రస్టు రూ.కోటితో 350 మంది రోగులకు సరిపడే భవనం నిర్మించారు. రోటరీ క్లబ్‌ మమ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌ సదుపాయాలున్న రూ.80 లక్షల విలువైన ప్రత్యేక బస్సును ఇవ్వనుంది.


  క్యాన్సర్‌ రోగులకు అత్యాధునిక భవనం
- డాక్టర్‌ మనోహర్‌, సంచాలకులు, నిమ్స్‌

మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ నిర్మించిన ఆధునిక భవనం, అందించిన పరికరాలు క్యాన్సర్‌ రోగుల చికిత్సకు ఎంతో ఊతమిస్తాయి. దాతలు ముందుగా మమ్మల్ని సంప్రదించి, రోగులకు ఏవి అత్యవసరమో తెలుసుకుని వితరణ చేస్తే ప్రయోజనం. మా ఆసుపత్రిలో డీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ రూ.1.80 కోట్లతో అత్యాధునిక ‘రెస్పిరేటరీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను నెలకొల్పింది. రాష్ట్ర విద్యుత్‌ బోర్డు ఇచ్చిన రూ.70 లక్షలతో 10 వెంటిలేటర్లు కొనుగోలు చేశాం.


 కొవిడ్‌ నాటి సమస్యలకు పరిష్కారం
- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

గాంధీకి యునైటెడ్‌ వే సంస్థ రూ.1.25 కోట్లతో 200 స్ట్రెచర్లు, 500 వీల్‌చైర్లు, 135 సీపాప్‌ యంత్రాలను అందజేసింది. ఆక్ట్‌ గ్రాంట్స్‌ సంస్థ రూ.60 లక్షల విలువైన 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఇచ్చింది. నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ రూ.38 లక్షల విలువైన 65 సీపాప్‌ యంత్రాలు, 600 ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు వితరణ చేసింది. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రూ.28 లక్షల విలువైన 38 సీపాప్‌ మిషన్లు, 14 వెంటిలేటర్లు ఇచ్చారు. జీఎంసీఏఏ సంస్థ రూ.14 లక్షలతో 9 బీపాప్‌ మిషన్లు, పల్స్‌ ఆక్సిమీటర్లు అందజేసింది. సహృదయ హెల్త్‌ మెడికల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు రూ.14 లక్షలతో బీపాప్‌ మిషన్లు, స్ట్రెచర్లు, మాస్కులు, వీల్‌ఛైర్లు ఇచ్చింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని