విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ

ప్రధానాంశాలు

విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ

ఆయన చేతుల మీదుగా జాతికి అంకితం
పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి కోవింద్‌    
చిన జీయర్‌స్వామి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌: వెయ్యేళ్ల కిందటే సమసమాజ స్థాపనకు కృషి చేసిన శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి తెలిపారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితమిస్తారని ప్రకటించారు. సోమవారం శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలో చినజీయర్‌ స్వామి విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతారన్నారు. హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ముఖ్యులు అతిథేయులుగా హాజరవుతారని వివరించారు. రామానుజాచార్యుల సేవలను భవిష్యత్తు తరాలకు గుర్తుచేసేలా సమతామూర్తి పేరిట పంచ లోహాలతో ఈ విగ్రహాన్ని నిర్మించామని తెలిపారు.

2 లక్షల కిలోల ఆవునెయ్యితో యాగాలు

సమారోహ ఉత్సవాలలో పండితులు రోజూ కోటిసార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తారన్నారు. 120 యాగశాలల్లో 1,035 కుండాలతో హోమాలు సాగుతాయన్నారు. ఐదు వేలమంది రుత్వికులు వేద పారాయణం చేస్తారన్నారు. యాగాల కోసం దేశవ్యాప్తంగా 2లక్షల కిలోల స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి సేకరిస్తామని చెప్పారు. ఈ నెయ్యితో యాగం చేయడం వల్ల వచ్చిన పొగ కారణంగా వాతావరణంలోని ప్రమాదకర వైరస్‌ అంతం అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.


120 కిలోల బంగారంతో విగ్రహం

రామానుజాచార్యులు 1017లో అవతరించి 120 ఏళ్లపాటు జీవించారని, అందుకే 120 కిలోల బంగారంతో 5అడుగుల ఎత్తులో శ్రీరామనుజుల విగ్రహాన్ని స్ఫూర్తి కేంద్రం రెండో అంతస్తులో ఏర్పాటు చేస్తామని చినజీయర్‌ స్వామి తెలిపారు. విలేకరుల సమావేశంలో అహోబిల జీయర్‌ స్వామి, దేవనాథ జీయర్‌స్వామి, మైహోమ్‌ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, జీవా అధ్యక్షుడు చలిమెడ లక్ష్మీనరసింహారావు, డా.అప్పారావు పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని