కమ్ముకొచ్చిన మేఘం.. అంతా ఆగమాగం!

ప్రధానాంశాలు

కమ్ముకొచ్చిన మేఘం.. అంతా ఆగమాగం!

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 7 నుంచి 14 సెం.మీ. వర్షం
వరదతో ప్రజల అవస్థలు.. కొట్టుకుపోయిన వాహనాలు
నేడూ అదే తీరున కురిసే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అప్పటిదాకా ఎండ కాస్తోంది.. చూస్తుండగానే కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకటీరెండు గంటల వ్యవధిలోనే భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ బహదూర్‌పుర పరిధిలోని చందూలాల్‌బారాదరి, నెహ్రూ జంతు ప్రదర్శనశాల ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. బహదూర్‌పుర, రామ్నాస్‌పుర మధ్య నాలా ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. బహదూర్‌పురాలో వరదలో చిక్కుకున్న జనాన్ని స్థానిక యువకులు తాళ్లు, బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షపు నీటికి కొన్ని ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. చందూలాల్‌బారాదరిలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ నెలలో నగరంలో ఇంత వర్షం ఒక్కరోజులో కురవడం ఇదే తొలిసారి అని వాతావరణ కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 7 నుంచి 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా చిట్కుల్‌(మెదక్‌ జిల్లా)లో 13.9 సెంటీమీటర్లు, అలియాబాద్‌(మేడ్చల్‌)లో 11.9, భువనగిరి(యాదాద్రి)లో 10.1, పాలకుర్తి(జనగామ)లో 10, హైదరాబాద్‌లో జూపార్క్‌ వద్ద 9.1, దూద్‌బౌలిలో 7.7, గూడూరు(మహబూబాబాద్‌)లో 9, చెన్నారావుపేట(వరంగల్‌)లో 9, ధర్మసాగర్‌(హనుమకొండ జిల్లా)లో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం కూడా అక్కడక్కడ ఇలాగే అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ నాగరత్న సూచించారు.


బండిపై వెళ్తుండగా పిడుగుపడి తల్లీకొడుకుల మృతి

ఏసీసీ(మంచిర్యాల), న్యూస్‌టుడే: సాఫీగా సాగుతున్న ఓ కుటుంబంపై విధి పగబట్టింది. పిడుగుపాటు రూపంలో తల్లి, కొడుకును బలి తీసుకోగా... తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన సోమవారం మంచిర్యాలలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పి.వెంకటేష్‌(35) తన భార్య మౌనిక(27), ఇద్దరు కుమారులు విశ్వతేజ(5), శ్రేయాన్‌(18 నెలలు)లతో మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలంలోని సీసీసీలో నివాసముంటున్నారు. ఈయన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. చిన్నకొడుకు శ్రేయాన్‌ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పెద్ద కుమారుడు విశ్వతేజను అమ్మమ్మ వద్ద ఉంచి సోమవారం ఉదయం భార్య, చిన్నకుమారుడితో కలసి వెంకటేష్‌ తన ద్విచక్రవాహనంపై మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం వర్షంలో తడుస్తూనే బయల్దేరారు. రైల్వేవంతెన మధ్యలోకి రాగానే వారి వాహనం సమీపంలో పిడుగుపడటంతో ముగ్గురూ చెల్లాచెదురయ్యారు. స్థానికుల సాయంతో పోలీసులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. తల్లి, కుమారుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.


 


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని