అంపశయ్యపై ఇంజినీరింగ్‌ కళాశాలలు

ప్రధానాంశాలు

అంపశయ్యపై ఇంజినీరింగ్‌ కళాశాలలు

గ్రామీణంలో కునారిల్లుతున్న విద్యాలయాలు
సీఎస్‌ఈ, ఈసీఈ తప్ప మిగిలిన బ్రాంచీల్లో పదిలోపే సీట్ల భర్తీ
ఏడేళ్లలో 74 కళాశాలల మూసివేత.. కొనఊపిరితో మరో 30

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, చుట్టుపక్కల తప్ప మిగిలిన జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత దశాబ్దకాలం నుంచే ఒక్కొక్కటి మూతపడుతుండగా.. గత ఆరేడు సంవత్సరాల్లో పదుల సంఖ్యలో కాలగర్భంలో కలిసిపోయాయి. సుమారు 40 మిగలగా.. వాటిలో 20-30 కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నదే నాలుగైదు బ్రాంచీలు.. వాటిలో సీఎస్‌ఈ, ఈసీఈ తప్ప మిగిలిన కోర్సుల్లో పట్టుమని పది మందీ చేరడం లేదు. 2014-15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 14 ప్రభుత్వ, 234 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. తాజా కౌన్సెలింగ్‌లో పాల్గొన్న కళాశాలల సంఖ్య 175. వీటిలో 15 ప్రభుత్వ కళాశాలలు కాగా.. మిగిలిన 160 ప్రైవేట్‌లోనివే. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 48 కళాశాలలుండగా ఇప్పుడు 11కి తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 28లో ఎనిమిది, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11లో రెండు మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తాజాగా ఎంసెట్‌ మొదటి విడత కేటాయింపులో నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో సీఎస్‌ఈ, ఈసీఈ తప్ప మిగిలిన బ్రాంచీల్లో పది లోపు సీట్లు భర్తీ అయిన కళాశాలలే అధికంగా ఉన్నాయి. కొన్ని కళాశాలల్లోని మెకానికల్‌ బ్రాంచీల్లో ఒక్కరూ చేరలేదు. ఈ విద్యాసంవత్సరంలో రెండు ప్రైవేట్‌ కళాశాలలు కొత్తగా ఏర్పాటు కాగా.. అవీ నగరంలోనే వచ్చాయి. పదో తరగతి పూర్తి కావడమే ఆలస్యం.. ఇంటర్‌మీడియట్‌లో ప్రవేశానికి గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కళాశాలలకే తమ పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఇక్కడి కళాశాలల్లో చదివినవారు ఆ తర్వాత సొంత జిల్లాల్లో ఇంజినీరింగ్‌ చదివేందుకు ఇష్టపడటం లేదు.


ఏడేళ్లలో 74 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు మూతపడ్డాయి. వాటిలో హెచ్‌ఎండీఏ పరిధిలోనివి 20 మిగిలిన 54 ఇతర జిల్లాల్లోనివే.


ఉద్యోగం చేయాల్సిన చోటే చదువుతున్నారు

-తుమ్మల పాపిరెడ్డి, మాజీ ఛైర్మన్‌, ఉన్నత విద్యామండలి

త అయిదారు సంవత్సరాలుగా విద్యార్థులు, తల్లిదండ్రుల ధోరణిలో బాగా మార్పు వచ్చింది. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. ఉద్యోగావకాశాలు నగరాల్లోనే ఎక్కువ కాబట్టి ఇక్కడే చదివేందుకు మొగ్గు చూపుతున్నారు. నాలుగేళ్లు చదివితే చాలు.. ఉద్యోగం వస్తుంది కదాని తల్లిదండ్రులు తమ శక్తికి మించి ఖర్చు చేసి పిల్లలను యాజమాన్య కోటాలోనైనా నగరాల్లోని కళాశాలల్లోనే చదివిస్తున్నారు.


సీట్ల పరిమితి ఉండాలి 

-కేఎస్‌.రవికుమార్‌, ఛైర్మన్‌, గ్రామీణ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం

తంలో ఒక్కో కళాశాలకు గరిష్ఠంగా 420 సీట్ల పరిమితి ఉండేది. నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) ఉంటే మరో 120 ఇచ్చేవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో వెయ్యి సీట్ల చొప్పున ఉన్నాయి. కళాశాలలో ఎన్ని సీట్లున్నా కొన్ని సీట్లకే బోధనా రుసుం మంజూరు చేసేలా ప్రభుత్వం పరిమితి విధించాలి.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని