మొఘల్‌ సామ్రాజ్యం కూలిన వేళ...

ప్రధానాంశాలు

మొఘల్‌ సామ్రాజ్యం కూలిన వేళ...

సెప్టెంబరు 21- భారత చరిత్రలో కీలకమైన రోజు!

సుమారు మూడు శతాబ్దాల మొఘల్‌ పాలన ముగిసిన రోజు.

భారత్‌లో చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌-ఖిఖిను తెల్లవారు నిర్బంధించిన రోజు.

1850 నాటికి దాదాపు భారత్‌ అంతటిపైనా అధికారం సుస్థిరం చేసుకున్న ఈస్టిండియా కంపెనీ, దిల్లీలో మాత్రం మొఘల్‌ చక్రవర్తి పాలనకు అంగీకరించింది. కారణం ఆయన తమ చెప్పుచేతల్లో ఉండటమే! కంపెనీ సేనలు దిల్లీలో ఉండేవి. అలా తెల్లవారి కనుసన్నల్లో షాజనాబాద్‌ (ప్రస్తుత పాత దిల్లీ ప్రాంతం)ను పాలించారు బహదూర్‌షా జఫర్‌!

1857 మేలో ఉత్తర భారతంలో సిపాయిల తిరుగుబాటు దెబ్బ అనూహ్యంగా దిల్లీని తాకింది. మేరఠ్‌లో ఉన్న ఈస్టిండియా కంపెనీ బెంగాల్‌ బెటాలియన్‌లోని భారతీయ సిపాయిలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. జూన్‌లో అనూహ్యంగా దిల్లీవైపు దూసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లాంటి చోట్ల తిరుగుబాటును అణచివేయటానికి ఈస్టిండియా సేనలు అప్పటికే వెళ్లటంతో దిల్లీలో తెల్లవారి బలగం పలచబడింది. దీంతో మేరఠ్‌ సిపాయిలకు దిల్లీని ఆక్రమించుకోవటం సులభమైంది. మసకబారిన మొఘల్‌ సామ్రాజ్య ప్రాభవాన్ని మళ్లీ పునరుద్ధరించాలనే సంకల్పం చెప్పుకొన్న ఈ సిపాయిలు దిల్లీలో అడుగుపెట్టగానే తెల్లవారిపై దారుణంగా విరుచుకుపడ్డారు. కనబడ్డ తెల్లవారిని ఊచకోత కోశారు. ఏమీ చేయలేని కొద్దిమంది బ్రిటిష్‌ సైనికులు పారిపోయారు. తొలుత దీన్ని వ్యతిరేకించినప్పటికీ... మళ్లీ తన రాజ్యస్థాపన అవుతోందన్న ఆశతో బహదూర్‌ షా జఫర్‌ తిరుగుబాటుకు మద్దతిచ్చారంటారు. అందుకే తమ ప్రభ వెలుగుతున్న రోజుల్లోలా సిపాయిల దాడి తర్వాత రోజూ పొద్దున్నే కోట కిటికీలోంచి ప్రజలకు దర్శనం ఇవ్వటం మొదలెట్టారు.

దిల్లీ తిరుగుబాటును ఈస్టిండియా కంపెనీ తీవ్రంగా పరిగణించింది. మూడునెలల్లో మళ్లీ పంజాబ్‌ నుంచి తమ సైన్యాలను రప్పించి, దిల్లీని చుట్టుముట్టింది. పట్టణం లోపలికి వస్తువుల సరఫరాను ఆపేసింది. కొద్దిరోజుల్లో పట్టణంలో కొరత మొదలైంది. సిపాయిలు దిల్లీని స్వాధీనమైతే చేసుకున్నారుగానీ వారిలో నాయకత్వం, సమన్వయం లోపించింది. చక్రవర్తిని సైతం అవమానించటం మొదలెట్టారు. ఈ మాత్రం లోపాలు సరిపోయాయి ఈస్టిండియా కంపెనీవారికి! ఫిరంగులతో విరుచుకుపడి... పట్టణం చుట్టూ ఉన్న బలమైనకోట దర్వాజాలను పేల్చి లోపలికి అడుగుపెట్టారు. సెప్టెంబరు 8న మొదలైన యుద్ధం 21న ముగిసింది. భారత సిపాయిలు భారీగానే ప్రతిఘటించినా నాయకత్వ, ప్రణాళిక లేమి వారిని దెబ్బతీసింది. ఈ దాడిలో ఎంతమంది మరణించారనేదానికి లెక్క లేకుండా పోయింది. దిల్లీ అంతా వల్లకాడైంది. ఎటు చూసినా లూటీలే! ఎలాంటి విచారణ లేకుండానే అనేకమందిని శిక్షించారు. ప్రఖ్యాత జామామసీదును మూసేసి ఈస్టిండియా కంపెనీ సైనికుల స్థావరం చేశారు. ఫతేపూర్‌ మసీదును గోదాముగా మార్చారు. ప్రజలందరినీ పారదోలారు. కేవలం ఈస్టిండియాకు అనుకూలమైనవారినే ఉండనిచ్చారు. మళ్లీ జనవరిలో మాత్రమే హిందువులను పట్టణంలోకి రానిచ్చారు. మొఘల్‌ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని చూశారనే కారణంతో చాలాకాలం పాటు ముస్లింలను తెల్లవారు పట్టణంలోకి రానివ్వలేదు.


పట్టణానికి 6 మైళ్ల దూరంలోని హుమయూన్‌ టూంబ్స్‌లో తలదాచుకున్న చక్రవర్తి బహదూర్‌షా జఫర్‌ను, ఆయన కుమారులు ముగ్గురిని ఈస్టిండియా సైనికాధికారి హడ్సన్‌ బంధించాడు. చక్రవర్తిపై జాలి చూపిన ఈస్టిండియా అధికారులు, ఆయన కుమారులు ముగ్గురిని మాత్రం కోటగుమ్మానికి ఉరితీశారు. బహదూర్‌షా జఫర్‌ను బంధించి రంగూన్‌ (నేటి మయన్మార్‌)కు పంపించారు. అలా 1857 సెప్టెంబరు 21న భారత్‌లో మొఘల్‌ సామ్రాజ్యం ముగిసింది. కొంతకాలం తర్వాత బహదూర్‌షా జఫర్‌ అనారోగ్యంతో రంగూన్‌లోనే మరణించారు.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని