ఎంపీలు, ఎమ్మెల్యేలూ పాఠాలు బోధిస్తారు

ప్రధానాంశాలు

ఎంపీలు, ఎమ్మెల్యేలూ పాఠాలు బోధిస్తారు

‘బీఏ ఆనర్స్‌’లో అమలు

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి వెల్లడి 

4 కళాశాలల్లో ‘ఆన్సర్‌’ కోర్సులకు అనుమతి 

వెబ్‌ ఆప్షన్ల గడువు 23 వరకు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెడుతున్న బీఏ ఆనర్స్‌ డిగ్రీలో అధ్యాపకులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు తరగతి గదికి వచ్చి పాఠాలు బోధించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. మంగళవారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. సాధారణ బీఏలో మూడు సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఉంటే బీఏ ఆనర్స్‌లో ఏదైనా ఒక సబ్జెక్టుపైనే ప్రధాన దృష్టి ఉంటుంది. దాన్ని మేజర్‌ సబ్జెక్టుగా విద్యార్థులు చదువుకుంటారు. మిగిలిన రెండు సబ్జెక్టులను మైనర్‌గా పిలుస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కోఠి మహిళా కళాశాలలో బీఏ (పొలిటికల్‌ సైన్స్‌), నిజాం కళాశాలలో బీఏ (ఎకనామిక్స్‌), బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ కోర్సులతో బీఏ ఆనర్స్‌ కోర్సులను ప్రారంభిస్తున్నారు. వీటిలో పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థులకు పార్లమెంట్‌, శాసనవ్యవస్థ వంటి పాఠ్యాంశాలపై సీనియర్లు, ఆసక్తి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కళాశాలలకు వచ్చి బోధించనున్నారని లింబాద్రి వెల్లడించారు. బీఏ ఎకనామిక్స్‌ విద్యార్థులకు బోధనకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు, ఆర్థికరంగ నిపుణులను ఆహ్వానిస్తామని, పరిస్థితులకు అనుగుణంగా వర్చువల్‌ విధానంలో కూడా వారు కొన్ని తరగతులు తీసుకుంటారని వివరించారు. తరగతి గది పాఠాలకు 50-60 శాతమే క్రెడిట్లు ఉంటాయని, మరో 40-50 శాతం.. ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లకు కేటాయిస్తారని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌లను కూడా తామే ఇప్పిస్తామని తెలిపారు.

అందరూ పోటీ పడవచ్చు: బీఏ ఆనర్స్‌లో ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయి. వీటిని మూడో విడత దోస్త్‌ ద్వారా భర్తీ చేస్తారు. మూడో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్ల గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. సీట్లు పొందిన వారు కూడా తాజాగా బీఏ ఆనర్స్‌ సీట్లకు పోటీ పడవచ్చని తెలిపారు.

 


ఒక్కో ఇంజినీరింగ్‌ కళాశాలకు వెయ్యికిపైగా సీట్లు ఎలా ఇస్తారు: వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌ నగరంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఒక్కోదానికి 1000కి పైగా సీట్లు ఇస్తున్నారు. ఇందులో కేవలం రెండు మూడు కోర్సులకే అత్యధిక సీట్లు కేటాయిస్తున్నారు. దీని వల్ల సమతుల్యత దెబ్బతినదా? దీనిపై అధికారులు ఆలోచించాలి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అన్నారు. బీఏ ఆనర్స్‌ కోర్సును మంగళవారం కోఠి మహిళా కళాశాలలో ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అంపశయ్యపై ఇంజినీరింగ్‌ కళాశాలలు’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌, కళాశాల ప్రిన్సిపల్‌ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని