డ్రగ్స్‌ కేసును కేటీఆర్‌కు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయొద్దు

ప్రధానాంశాలు

డ్రగ్స్‌ కేసును కేటీఆర్‌కు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయొద్దు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం కొనసాగుతున్న డ్రగ్స్‌ కేసు దర్యాప్తుతో ముడిపెట్టి రాష్ట్ర మంత్రి కె.తారక రామారావుపై ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయరాదంటూ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మంగళవారం సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు నేపథ్యంలో కేటీఆర్‌ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సామాజిక మాధ్యమాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతో సహా బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలంటూ మంత్రి కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై మంగళవారం సిటీ సివిల్‌ కోర్టు 3వ అదనపు చీఫ్‌ జడ్జి కల్యాణ్‌ చక్రవర్తి విచారణ చేపట్టారు. మంత్రి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రత్యర్థిగా రాజకీయాలతో కూడిన ఆరోపణలు చేయడం కాస్త సబబుగా ఉంటుందని, అంతేగానీ దర్యాప్తులో ఉన్న క్రిమినల్‌ కేసుతో ముడిపెడుతూ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. విచారణ నిమిత్తం నిందితులు కానివారికీ నోటీసులు జారీ చేస్తారని,  వారి పాత్ర ఉంటేనే నిందితులుగా చేరుస్తారని చెప్పారు. మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో పదేపదే ఆరోపణలు చేస్తున్నారని, పిటిషనర్‌ మాదక ద్రవ్యాల బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, దర్యాప్తు నిమిత్తం ఈడీ పిలిచిన వారితో సంబంధాలున్నాయంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. యువతకు ఆదర్శంగా ఉంటూ పలు పురస్కారాలు అందుకున్న వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని వాదించారు. తక్షణం ఇలాంటి తప్పుడు ఆరోపణలను నిలిపివేసేలా ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. వాదనలను విన్న కోర్టు... పిటిషనర్‌కు వ్యతిరేకంగా డ్రగ్స్‌ కేసును ముడిపెడుతూ ఎలాంటి ఆరోపణలు, ప్రకటనలు  చేయరాదంటూ రేవంత్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని