ఆధునికీకరణే శరణ్యం!

ప్రధానాంశాలు

ఆధునికీకరణే శరణ్యం!

రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి

మిల్లింగులో విపరీత జాప్యం

రైస్‌ మిల్లుల సామర్థ్యం పెంచాలని కేంద్రం సూచన

నూకల శాతం తగ్గింపునకు ఇదే మార్గమని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం దిగుబడికి, మిల్లింగ్‌ సామర్థ్యానికి పొంతన కుదరటం లేదు. ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించినప్పటి నుంచి 45 రోజుల్లో ఎఫ్‌సీఐకి బియ్యాన్ని ఇవ్వాలి. మిల్లుల సామర్థ్యం అంతంతమాత్రంగా ఉండటంతో బియ్యాన్ని అందించడానికి సగటున 110 నుంచి 150 రోజులు పడుతోంది. రాష్ట్రంలో సాధారణ బియ్యం మిల్లులు 1,592, ఉప్పుడు(బాయిల్డు) బియ్యం మిల్లులు 1,025 ఉన్నాయి. గత వానాకాలం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 97 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సాధారణ బియ్యం మిల్లులన్నీ కలిపి రోజుకు 24 మెట్రిక్‌ టన్నులు మాత్రమే బియ్యంగా మారుస్తాయి. ఆ ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలంటే కనీసం 110 రోజులు పడుతుంది. అదే ఉప్పుడు బియ్యమైతే 230 రోజుల వరకు పడుతుంది. రాష్ట్రంలో పది నుంచి పదిహేనేళ్ల కిందట ఏర్పాటు చేసిన మిల్లులే ఎక్కువగా ఉన్నాయి. అప్పటి ధాన్యం దిగుబడికి అను కూలంగా వాటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దిగుబడి పెరగడంతో మిల్లింగులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. బియ్యంలో నూకల శాతానికి సంబంధించి కూడా కేంద్రం తాజాగా నిబంధనలను మార్చింది. గతంలో క్వింటాలుకు 25 శాతం నూకలను అనుమతించేది. ఇప్పుడు 20 శాతానికి తగ్గించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మిల్లుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం 1,066 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అందులో ఎక్కువ భాగం బియ్యం మిల్లుల దరఖాస్తులే ఉన్నట్లు సమాచారం. ఆధునిక మిల్లులు వస్తే మిల్లింగ్‌ సామర్థ్యం పెరగడంతోపాటు నూకల శాతం 3 నుంచి 4 శాతం తగ్గుతుందని అంచనా.

దశాబ్దాల నాటి మిల్లులతో ఎలా?

ప్రస్తుతమున్న మిల్లులను ఆధునికీకరించే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని మిల్లర్లు చెబుతున్నారు. కేంద్రం నూకల శాతంలో కోత విధించడంతో.. దశాబ్దాల కిందటి బియ్యం మిల్లులతో మిల్లింగ్‌ చేయడం ఎలా అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. తగ్గించిన ఈ నూకల శాతం విధానం వచ్చే వ్యవసాయ సీజను నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. తగ్గించిన శాతం మేరకు బియ్యం మిల్లింగ్‌ చేయలేమని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. దీనిపై పునరాలోచించాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కేంద్రానికి లేఖలు రాసింది. రానున్న రోజుల్లో ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 1,025 ఉప్పుడు మిల్లుల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.


బియ్యంలో నూకల శాతాన్ని తగ్గించేందుకు మిల్లులను ఆధునికీకరించాలి. ఇప్పటి వరకు 25 శాతం నూకలను అనుమతించాం. ఇక నుంచి 20 శాతం మాత్రమే అనుమతిస్తాం. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో మిల్లుల ఆధునికీకరణకు ప్రాధాన్యమివ్వాలి.

- కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సూచన


 తెలంగాణలో రోజు వారీగా ఉప్పుడు, సాధారణ బియ్యం మిల్లింగ్‌ సామర్థ్యం 87,408 మెట్రిక్‌ టన్నులు. రాష్ట్రంలోని ధాన్యం దిగుబడి పెరగటంతో మిల్లింగులో విపరీత జాప్యం జరుగుతోంది. మిల్లుల రోజువారీ సామర్థ్యాన్ని మరో 70 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచాలి.

- మిల్లర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని