నైపుణ్యాలకు సానబెడితే మనదే అగ్రస్థానం

ప్రధానాంశాలు

నైపుణ్యాలకు సానబెడితే మనదే అగ్రస్థానం

ఆంగ్లం రాకున్నా నైపుణ్యం వల్లే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా ముందంజ 

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్ల వెల్లడి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నైపుణ్యాలపై శ్రద్ధ పెడితే ప్రపంచానికి మానవ వనరులను అందించడంలో మనదేశం అగ్రస్థానం దక్కించుకుంటుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు. యూఎస్‌, జపాన్‌, చైనా, యూరప్‌ తదితర దేశాల్లో మన యువ ఇంజినీర్లు ఎంతోమంది పనిచేస్తున్నారని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ ఎఫ్‌టీసీసీఐలో ఏర్పాటు చేసిన వాణిజ్య సప్తాహ్‌లో ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధి జీడీపీ వృద్ధిపైనే అధారపడి ఉంటుందని, ఇందుకోసం ఉత్పత్తి, ఆవిష్కరణలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంగ్లం సరిగా మాట్లాడలేని చైనీయులు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం వల్ల శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారని వివరించారు. మంచి డిగ్రీలు, జ్ఞానం ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక భారత్‌ వెనకబడుతోందన్నారు. ఒకప్పుడు కెనడాలో కుసుమ నూనె ఉత్పత్తే ఉండేది కాదని, ప్రస్తుతం అక్కడి నుంచి ఎగుమతవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో 55 నుంచి 60 శాతం అదే ఉంటోందన్నారు. ఇతర దేశాల నుంచి గింజలను దిగుమతి చేసుకుని నూనె తీసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోందన్నారు. తెలంగాణలో పసుపు పంటకు ఆ తరహా గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. గతంలో యుద్ధాలు అనేక ఆవిష్కరణలకు కారణమయ్యాయని కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారి వల్ల భవిష్యత్తులో అనేక మార్పులు రానున్నాయని అందుకు అనుగుణంగా నియంత్రణ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ రానుందని ఆయన చెప్పారు. వ్యాధి నిరోధకశక్తిని పెంచేలా కార్టీసెల్‌ థెరపీ, ఎన్‌కే సెల్‌ థెరపీలు జరగనున్నాయని తెలిపారు. ఇందుకోసం రోగి శరీరం నుంచి రక్త కణాలను తీసి ఇంజినీరింగ్‌ చేసి అనంతరం అదే రోగి శరీరంలోకి ఎక్కిస్తారని వివరించారు. త్వరలో 3డీ మాన్యుఫాక్చరింగ్‌ సాంకేతికత అందుబాటులోకి రానుందని ఇందుకోసం మార్గదర్శకాలు విడుదలయ్యాయని గుర్తుచేశారు. పరిశోధనల కోసం జంతువుల దిగుమతులకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేయాలని, హైదరాబాద్‌ కేంద్రంగా ఫార్మాగ్జిల్‌ ఆధ్వర్యంలో ఇది ఉండేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో కైటెక్స్‌ యూనిట్‌

ఎగుమతులు దేశ జీడీపీ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని తెలంగాణ ఐటీశాఖ ముయకార్యదర్శి జయేశ్‌రంజన్‌ అన్నారు. ‘‘కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కైటెక్స్‌ గ్రూపు అక్కడ పెట్టుబడులు ఉపసంహరించుకుని తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ యూనిట్‌ను ఏర్పాటు చేసి చిన్నపిల్లల వస్త్రాలను ఎగుమతి చేయనుంది. ఈ కంపెనీ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న పత్తిని వినియోగించి వస్త్రాలను తయారుచేసి తిరిగి ఆ దేశానికే ఎగుమతి చేస్తుంది. కొన్నేళ్లలో ఈ పరిస్థితి మారి తెలంగాణ పత్తి వినియోగంలోకి వస్తుందని’’ ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎక్స్‌పోర్ట్స్‌ కమిషనర్‌ కృష్ణభాస్కర్‌, భారత ఫారిన్‌ ట్రేడ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ జి.సీతారాంరెడ్డి, ఫార్మాగ్జిల్‌ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


పిల్లల వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ రెండోదశ పూర్తి

18 ఏళ్లలోపు పిల్లలకు ఉద్దేశించిన కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్‌ రెండోదశ పూర్తయిందని కృష్ణ ఎల్ల తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను వారంరోజుల్లో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌కు అందజేయనున్నట్లు వెల్లడించారు. టీకా డోసుల ఉత్పత్తి సెప్టెంబరులో 35 మిలియన్లు ఉండగా అక్టోబరుకల్లా 55 మిలియన్లకు చేరుకోనుందన్నారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ వచ్చే నెలాఖరులోగా పూర్తవుతాయని చెప్పారు. భాగస్వాములు సహకరిస్తే నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయొచ్చన్నారు. కేంద్రం అనుమతిస్తే వ్యాక్సిన్‌ ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం దేశీయ అవసరాలు తీర్చడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టిందన్నారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని