రికార్డుస్థాయిలో పంట కొనుగోలుతోనే తంటా

ప్రధానాంశాలు

రికార్డుస్థాయిలో పంట కొనుగోలుతోనే తంటా

కోటీ 38 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా

అర్థ గణాంకశాఖ ముందస్తు అంచనాలు

ఎఫ్‌సీఐ కొంటామని చెప్పింది 60 లక్షల టన్నులే

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు పండించే పంటలను మద్దతు ధరకు కొనడమే ప్రధాన సమస్యగా మారనుంది. రాష్ట్రంలో వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ చరిత్రలోనే రికార్డుస్థాయిలో కోటీ 38 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కేంద్రానికి రాష్ట్ర అర్థ, గణాంకశాఖ మంగళవారం నివేదిక పంపింది. ఇందులో 40 లక్షల టన్నుల బియ్యం(60 లక్షల టన్నుల ధాన్యం) మాత్రమే కొంటామని ‘భారత ఆహార సంస్థ’(ఎఫ్‌సీఐ) ఇప్పటికే తెలిపింది. మిగిలిన 78 లక్షల టన్నుల ధాన్యంలో రైతులు సొంతానికి కొంత వాడుకోగా మిగిలిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా లేక వ్యాపారులకు వదిలేస్తుందా అనేది వేచిచూడాలి. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పాదకతపై ఈ శాఖ ఏటా నాలుగుసార్లు ముందస్తు అంచనాల నివేదికలను తయారుచేస్తుంది. ఈ ఏడాది(2021-22) వానాకాలంలో రాష్ట్రంలో పండే పంటలపై తొలి నివేదికను కేంద్రానికి పంపింది.

నివేదికలోని ముఖ్యాంశాలు

* ఆహార ధాన్యాలు కోటీ 9 లక్షల టన్నులు, పప్పుధాన్యాలు 5.80 లక్షల టన్నులు, నూనెగింజలు 2.70 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది.

* గతేడాది(2020) వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 96.31 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. కోటీ 38 లక్షల టన్నుల ధాన్యం రానుంది. ఎకరానికి సగటున 26.52 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. గతేడాదితో పోలిస్తే 43 శాతం పెరగనుంది.

* గతేడాది వానాకాలంలో 96.31 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ముందస్తు అంచనాలో తెలిపినా.. చివరికి రైతుల నుంచి 45 లక్షల టన్నులే రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. ఈ సీజన్‌లో ఎంత కొంటుందనేది కీలకప్రశ్న.

* పత్తి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 10 లక్షల ఎకరాలు తగ్గింది. గతేడాది 60 లక్షల ఎకరాల్లో సాగవగా ఇప్పుడు 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అయినా దిగుబడి 57.87 లక్షల బేళ్ల నుంచి 69.46 లక్షల బేళ్లకు పెరుగుతుందని అంచనా. (ఒక బేలు పత్తి అంటే 170 కిలోల దూది.) వాతావరణం అనుకూలంగా ఉన్నందునే దిగుబడి, ఉత్పాదకత పెరుగుతాయని అర్థ, గణాంకశాఖ తేల్చింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని