ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచండి

ప్రధానాంశాలు

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచండి

రెండు నెలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి
జిల్లాలవారీగా చిన్న పిల్లల వైద్యుల వివరాలు సమర్పించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న దసరా, దీపావళి, క్రిస్‌మస్‌ పండగలను దృష్టిలో ఉంచుకుని కొవిడ్‌ పరీక్షలను పెంచాలని, అందులోనూ ఎక్కువ శాతం ఆర్టీపీసీఆర్‌ ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు ప్రారంభమైనందున పిల్లల ద్వారా కరోనా లక్షణాలు ఇళ్లలోని పెద్దలకు వ్యాపించే అవకాశం ఉందని.. బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ టీకాలు వేయడం రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) శ్రీనివాసరావు హామీని రికార్డు చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ‘కలర్‌ గ్రేడెడ్‌ యాక్షన్‌ ప్లాన్‌’ (ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక)ను ఈ నెల 30లోగా సమర్పించాలని ఆదేశించింది. జిల్లాలవారీగా ఎంత మంది పిల్లల డాక్టర్లున్నారు? భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదికలో పేర్కొనకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ఉత్తర్వుల అమలుపై అక్టోబరు 4 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కొవిడ్‌పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. కొవిడ్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించినట్లు చెప్పారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ఎందుకు తగ్గించారని ధర్మాసనం ప్రశ్నించగా.. శ్రీనివాసరావు సమాధానమిస్తూ ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని జిల్లా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నపిల్లల డాక్టర్లున్నారని, తగినన్ని బెడ్‌లున్నాయని చెప్పారు. ‘కలర్‌గ్రేడెడ్‌ యాక్షన్‌ ప్లాన్‌’పై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డీహెచ్‌ బదులివ్వగా.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ దశలో ఏజీ సమాధానమిస్తూ.. వచ్చే నివేదికలో స్పష్టత ఇస్తామనగా ఈ ఉత్తర్వులను అమలు చేసేలా సలహా ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. మొత్తం 2.8 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉందని, ఇందులో 1.66 కోట్ల మందికి మొదటి దశ పూర్తయిందని డీహెచ్‌ తెలిపారు.


‘అత్యవసర ఔషధాల’పై ఇంకెన్ని మరణాలు సంభవించాక నిర్ణయం తీసుకుంటారు
కేంద్రం నిరాసక్తతపై ధర్మాసనం అసంతృప్తి

త్యవసర జాబితాలో కొవిడ్‌ మందులను చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిరాసక్తత తమకు అర్థం కావడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంకా ఎక్కువ మరణాలు సంభవించాక నిర్ణయం తీసుకుంటారా? అని నిలదీసింది. దీనిపై అక్టోబరు 31లోగా నిర్ణయం తీసుకోవాలంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై నిర్ణయం తీసుకోవచ్చని, ఎందుకీ నాన్చుడని అడిగింది. సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు సమాధానమిస్తూ.. జాబితా తయారైందని ఉదయమే సమాచారం వచ్చిందని, త్వరలో నోటిఫికేషన్‌ జారీ కానుందని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని