అంకురానికి అందలం

ప్రధానాంశాలు

అంకురానికి అందలం

స్టార్టప్‌లలో ఆసియా టాప్‌-20లో తెలంగాణ
జీనోమ్‌ నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: స్టార్టప్‌లలో తెలంగాణ రాష్ట్రానికి మరో గౌరవం దక్కింది. అంకుర సంస్థలకు అనుకూలమైన వాతావరణం, పెట్టుబడుల విషయంలో ఆసియాలో టాప్‌-20లో చోటు దక్కించుకుంది. బెంగళూరు ప్రథమంలో ఉండగా మన రాష్ట్రం 15లో నిలిచింది. ఈ విషయాన్ని బుధవారం లండన్‌లో విడుదలైన స్టార్టప్‌ జీనోమ్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అంకుర వ్యవస్థలో బెంగళూరు 23వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌, పుణె, చెన్నై నగరాల్లోని వ్యవస్థలు అంతర్జాతీయ టాప్‌ 100లో ఉన్నాయి. నివేదికలో అంతర్జాతీయంగా తెలంగాణ అనుకూలతలు, బలం గురించి స్టార్టప్‌ జీనోమ్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు ప్రస్తావిస్తూ.. ‘‘అందుబాటులోని మేధో సంపద, వేగంగా లభించే టెక్నాలజీ నిపుణుల విషయంలో తెలంగాణ ఆసియాలో 15వ స్థానంలో ఉంది. ప్రాంతీయ పర్యావరణ నిధుల సమీకరణలో మొదటి 20 స్థానాల్లో నిలిచింది. అంకుర వ్యవస్థల పనితీరు, పరిశోధన, మేధోసంపత్తి హక్కులు, దీర్ఘకాలిక వ్యూహాలు, మానవ వనరుల విషయంలో టాప్‌-30లో ఉంది’’ అని వివరించింది.

రెండున్నరేళ్లలో రూ.886 కోట్ల పెట్టుబడులు

రెండున్నరేళ్లలో రూ.886 కోట్ల పెట్టుబడులతో అంకుర వ్యవస్థ విలువ రూ.11,817 కోట్లకు చేరిందని నివేదిక ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న నియామక ప్రోత్సాహకం, పనితీరు ఆధారంగా లభించే గ్రాంట్లతో అంకురాలు తెలంగాణకు వెల్లువెత్తుతున్నాయని వెల్లడించింది. లైఫ్‌సైన్సెస్‌, కృత్రిమమేధ (ఏఐ), బిగ్‌డేటా, అనలటిక్స్‌ రంగాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వివరించింది. తెలంగాణను అంతర్జాతీయ అంకుర సంస్థల కేంద్రంగా నిలిపేందుకు వ్యాపారవేత్తలు, అధికారులు, స్థానిక నాయకులు అందరూ కలిసి సమీకృత సాంకేతిక వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారని స్టార్టప్‌ జీనోమ్‌ సీఈవో జెఫ్‌ గౌథీర్‌ తెలిపారు. ఈ వ్యవస్థతో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. టీ-హబ్‌ (తెలంగాణ అంకురాల మౌలిక సదుపాయాల సంస్థ), స్టార్టప్‌ జీనోమ్‌ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను ప్రచురించాయి. అంతర్జాతీయ అంకుర సంస్థల నివేదికలో తెలంగాణకు చోటు దక్కడంపై టీ-హబ్‌ సీఈవో రవినారాయణ్‌ హర్షం వ్యక్తం చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని