ఎందరు రైతులు వరి మానేస్తారు!?

ప్రధానాంశాలు

ఎందరు రైతులు వరి మానేస్తారు!?

యాసంగి సాగుపై  అధ్యయనానికి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్న కొత్త యాసంగి (రబీ) సీజన్‌లో ఎందరు రైతులు వరి సాగు మానేస్తారో కచ్చితమైన వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ బుధవారం నిర్ణయించింది. ప్రతి రైతు వద్దకెళ్లి వరి సాగు చేయవద్దని చెప్పాలని, ప్రత్యామ్నాయంగా నూనెగింజలు, పప్పుధాన్యాలు, జొన్న తదితరాలు వేసేలా అవగాహన కల్పించాలని సూచించింది. గ్రామస్థాయిలో ‘వ్యవసాయ విస్తరణ అధికారులు’ (ఏఈఓలు) ప్రతి రైతును కలిసి లేదా రైతువేదికల వద్దకు వచ్చిన వారితో మాట్లాడాలని, వరి కచ్చితంగా మానేస్తామని చెప్పిన వారి పేర్లను నమోదు చేయాలంది. ప్రత్యామ్నాయ పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తారో రైతుల వారీగా సేకరించి ప్రభుత్వానికి  30కల్లా పంపాలని ఆదేశించింది. వాటి ఆధారంగా  కావాల్సిన విత్తనాలను వచ్చే నెలలో రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీఎస్‌ సీడ్స్‌కు సూచించింది.

రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం రాష్ట్ర చరిత్రలోనే రికార్డుస్థాయిలో 61.75 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదించింది. గతేడాది కన్నా 8.75 లక్షల ఎకరాల్లో పెరగడం గమనార్హం. అన్ని రకాల పంటలు కలిపి కోటీ 16 లక్షల ఎకరాలకు గాను కోటీ 29 లక్షల్లో సాగుచేశారు. ఆహారధాన్యాలు సాధారణంకన్నా 38% అదనంగా సాగవగా పప్పుధాన్యాలు 20.50%, నూనెగింజలు 30.82% విస్తీర్ణం తగ్గడం గమనార్హం. అన్ని రకాల పంటల్లో వరి తప్ప మరేది సాధారణంకన్నా అదనంగా సాగుకాలేదు. పత్తి, కంది కూడా రికార్డు స్థాయిలో పెరుగుతాయని వ్యవసాయశాఖ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని