26 వేల యూనిట్ల దరఖాస్తుల పెండింగ్‌

ప్రధానాంశాలు

26 వేల యూనిట్ల దరఖాస్తుల పెండింగ్‌

సెలూన్లు, ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌ పథకం నెమ్మదిగా అమలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సెలూన్లు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అమలు నెమ్మదిగా నడుస్తోంది. ఏప్రిల్‌ నుంచి పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అర్హులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రాలేదు. మీటర్లు లేనివారికి కొత్తగా మంజూరు చేసినా, ఆ వివరాలను డిస్కంలతో అనుసంధానం చేయకపోవడంతో లబ్ధిపొందలేకపోతున్నారు. హెయిర్‌ సెలూన్లతో ఉపాధి పొందుతున్న నాయీబ్రాహ్మణులు, ధోబీ ఘాట్లతో జీవనాన్ని సాగిస్తున్న రజకులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 1 నుంచి 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 63 వేల యూనిట్ల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో డిస్కంలతో 36,906 యూనిట్ల అనుసంధానం పూర్తయింది. అయితే, అనుసంధానం కాని, కొత్తగా మీటర్ల కోసం వచ్చిన దరఖాస్తులు 26,106పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డిస్కంలతో ఇప్పటికే అనుసంధానమైన యూనిట్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఈ పథకం కింద రిజిస్ట్రేషన్లు భారీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 9,331 యూనిట్లకు మాత్రమే లబ్ధి చేకూరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిస్కంలకు లబ్ధిదారుల తరపున ఇప్పటి వరకు రూ.1.82 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని