వ్యూహాత్మక బంధం బలోపేతం

ప్రధానాంశాలు

వ్యూహాత్మక బంధం బలోపేతం

దేశాధి నేతలతో భేటీపై మోదీ ఆశాభావం  
అమెరికాకు పయనమైన ప్రధాని

దిల్లీ: భారత్‌-అమెరికాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేసేదిగా తన విదేశీ పర్యటన నిలిచిపోనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్‌, ఆస్ట్రేలియాలతోనూ దౌత్య బంధాలు దృఢతరమవుతాయని ట్వీట్‌ చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసే ప్రసంగంతో పర్యటన ముగుస్తుందంటూ ఈ నెల 22 నుంచి 25 వరకు తాను పాల్గొనే కార్యక్రమాలను వివరించారు. మోదీ బుధవారం ‘ఎయిర్‌ ఇండియా వన్‌’లో అమెరికాకు బయలుదేరారు. ఆయనతో పాటు జాతీయ భద్రత సలహాదారుడు అజిత్‌ డోభాల్‌, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా సహా పలువురు ఉన్నతాధికారులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్తున్నట్లు మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌- యూఎస్‌ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి బైడెన్‌తో చర్చిస్తానని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటామన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్‌ సదస్సులోనూ పాల్గొంటాను. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భవిష్యత్‌ కార్యాచరణ, ప్రాధాన్యాలను గుర్తించడానికి ఈ సదస్సు దోహదపడుతుంది’ అని మోదీ తెలిపారు. జపాన్‌, ఆస్ట్రేలియా నేతలతో విడివిడిగానూ భేటీ కానున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

పాక్‌ గగనతలంపై నుంచి ప్రయాణం

మోదీ బయల్దేరిన విమానం పాకిస్థాన్‌ గగనతలంపై నుంచి ప్రయాణించింది. అఫ్గాన్‌ మీదుగా వెళ్లాల్సిన విమానాన్ని.. భద్రత కారణాల దృష్ట్యా పాక్‌ మీదుగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు పాకిస్థాన్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. భారత నిఘా వర్గాల సూచన మేరకు ఈ మార్పు జరిగింది. అధికరణం 370 రద్దు తర్వాత భారత్‌పై గుర్రుగా ఉన్న పాకిస్థాన్‌.. గగనతలాన్ని ఉపయోగించుకోకుండా చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐస్‌లాండ్‌ పర్యటన సహా మోదీ అమెరికా, జర్మనీ పర్యటనల కోసం భారత అధికారులు గతంలో అనుమతులు కోరగా మూడుసార్లు తిరస్కరించింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శ్రీలంక పర్యటన కోసం మన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు భారత్‌ అనుమతించింది.

ఆ విమానం ఎంతో ప్రత్యేకం

మోదీ ప్రయాణిస్తున్న ‘ఎయిర్‌ ఇండియా వన్‌’ విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత పటిష్ఠ భద్రతతో దీన్ని రూపొందించారు. క్షిపణులు ప్రయోగించినా వాటిని అడ్డుకునే సాంకేతికత ఇందులో ఉంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని