నేడు దిల్లీకి సీఎం కేసీఆర్‌

ప్రధానాంశాలు

నేడు దిల్లీకి సీఎం కేసీఆర్‌

కేంద్ర మంత్రులతో భేటీకి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీకి వెళ్తున్నారు. ఉదయం శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో సీఎం హస్తినకు పయనమవుతారు.  శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఆయన కీలక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించేందుకు ఈ పర్యటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీలో శనివారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కేసీఆర్‌ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్‌ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల సమీక్షకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్వహించే భేటీలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చిస్తారు. ఆదివారం సాయంత్రం దిల్లీ పర్యటన ముగించుకొని కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.

* ఏపీ ప్రభుత్వం అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటిని ఆపాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పలు దఫాలు విన్నవించింది. సీఎం కేసీఆర్‌తో పాటు ఉన్నతాధికారులూ లేఖలురాశారు. మరోవైపు కృష్ణాగోదావరి యాజమాన్యాల బోర్డు పరిధిపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపైనా రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సీఎం భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* దొడ్డు బియ్యం కొనుగోలుపై కేంద్రం నిస్సహాయతను వ్యక్తం చేయడంపైనా రాష్ట్రం ఆందోళనతో ఉంది. ఇది వరిసాగును ప్రభావితం చేస్తుందని, అన్నదాతలకు, మిల్లర్లకు నష్టదాయకంగా మారుతుందనే ఉద్దేశంలో వాస్తవ పరిస్థితులను పీయూష్‌ గోయల్‌కు వివరించి కొనుగోళ్లను కొనసాగించాలని కోరే అవకాశం ఉంది.

మొదటి వారంలో దిల్లీకి వెళ్లిన సీఎం

సీఎం కేసీఆర్‌ ఈ నెల 1న హస్తినకు వెళ్లి 9 వరకు అక్కడే ఉన్నారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయం శంకుస్థాపన అనంతరం 3న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. వివిధ అంశాలపై పది వినతిపత్రాలు అందజేశారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. ఆ తర్వాత రెండు వారాలకే సీఎం దిల్లీకి వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని