ప్రమాదం పసిగడుతుంది.. పరిష్కారం చూపిస్తుంది

ప్రధానాంశాలు

ప్రమాదం పసిగడుతుంది.. పరిష్కారం చూపిస్తుంది

నాగ్‌పుర్‌లో ‘ఐ రాస్తే’ పేరిట రహదారి భద్రత ప్రాజెక్టు

హైదరాబాద్‌లోనూ ట్రిపుల్‌ఐటీ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా అమలు

ఈనాడు, హైదరాబాద్‌: రహదారి ప్రమాదాల్లో నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్‌సీఈర్‌బీ లెక్కల ప్రకారం గతేడాది 1.20 లక్షల మంది చనిపోయారు. 2030 నాటికి ఈ సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు వారాల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఇంటెలిజెంట్‌ సొల్యూషన్స్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఐ రాస్తే) ప్రాజెక్టును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. ఇప్పటికే ఈ తరహా ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.

ఏమిటీ ప్రాజెక్టు?

ట్రిపుల్‌ఐటీ ఆర్‌ అండ్‌ డీ డీన్‌ ప్రొ. సి.వి.జవహర్‌ నేతృత్వంలో రహదారి భద్రత ప్రాజెక్టును హైదరాబాద్‌లో మూడు నెలల క్రితం ప్రారంభించారు. దీనికి వరల్డ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డబ్ల్యూఆర్‌ఐ) సహకారం అందిస్తోంది. వివిధ కంపెనీలకు చెందిన 20 షటిల్‌ బస్సుల్లో ప్రత్యేకంగా ‘మొబిలై’ అనే సెన్సర్లు అమర్చారు. వీటిని ఇంటెల్‌ కంపెనీ అందించింది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే.. సెన్సర్‌ వెంటనే గుర్తించి డ్రైవర్‌ అప్రమత్తమయ్యేలా ‘బీప్‌’ శబ్దం చేస్తుంది. సెన్సర్‌తో పాటు బస్సుకు అమర్చిన కెమెరాలు ఆ ప్రాంతాన్ని, ప్రమాద కారకాలను ఫొటోలు తీసి వర్సిటీలోని కంప్యూటర్‌ ల్యాబ్‌కు కృత్రిమ మేధ సాయంతో పంపిస్తాయి. బీప్‌ శబ్దం వచ్చిన ప్రాంతంలో ప్రమాదం జరిగేందుకు ఏ అంశాలు కారణమవుతున్నాయో విశ్లేషించి నివేదిక రూపొందిస్తారు. తద్వారా రహదారి స్థితిగతులను సమగ్రంగా విశ్లేషించేందుకు వీలుంటుందని ట్రిపుల్‌ఐటీ కో ఇన్నోవేషన్‌ ఆచార్యుడు ప్రొ.రమేశ్‌ లోగనాథన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారులపై ఈ ప్రాజెక్టు చేపట్టాలని వర్సిటీ అధికారులు యోచిస్తున్నారు.


నాగ్‌పుర్‌ ప్రాజెక్టు ప్రత్యేకత

నాగ్‌పుర్‌ నగరంలో ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఐ రాస్తే’ ప్రాజెక్టులో ట్రిపుల్‌ఐటీతో పాటు ఐఎన్‌ఏఐ, ఇంటెల్‌, సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ, మహీంద్రా అండ్‌ మహీంద్ర, నాగ్‌పుర్‌ కార్పొరేషన్‌ భాగస్వాములయ్యాయి. ఇంటెల్‌ తరఫున అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్ట్‌ సిస్టమ్‌(అడాస్‌) ప్రత్యేకంగా రూపొందించిన సెన్సర్లను అక్కడి సిటీ బస్సుల్లో అమర్చారు. ఏదైనా వాహనం సమీపంలోకి రాగానే డ్రైవర్‌ను అప్రమత్తం చేసేలా ఇవి వాయిస్‌ సందేశం వినిపిస్తాయి. పాదచారులు, సైక్లిస్టులు, జంతువులను ఢీకొట్టినా లేదా సమీపంలోకి రాగానే అప్రమత్తం చేస్తాయి. లేన్‌(వరుస) పాటించకపోయినా హెచ్చరిస్తుంది. ఈ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా ప్రమాదాలకు దారితీసేలా రహదారి డిజైన్‌లో లోపాలుంటే గుర్తించి సరిచేస్తారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని