ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ప్రధానాంశాలు

ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

విచారణకు హాజరు కానందుకు జారీ

30న హాజరుపరచాలని పోలీసులకు సీబీఐ కోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితురాలైన ఏపీ ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు గురువారం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. దాల్మియా కేసులో 5వ నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి గురువారం కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్‌ జారీచేసింది. ఈ నెల 30న హాజరుపరచాలని పోలీసు అధికారులను ఆదేశించింది. రాంకీ కేసులో నిందితుడైన మాజీ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డి గురువారం హాజరుకావడంతో గతంలో జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను కోర్టు ఉపసంహరించింది. ఈ కేసులో రాంకీ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. వాన్‌పిక్‌ కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఐఆర్‌ఎస్‌ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డిల తరఫున న్యాయవాదుల హాజరుకు హైకోర్టు అనుమతించినా, న్యాయవాదులు కూడా రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. దాల్మియా, వాన్‌పిక్‌, జగతి పబ్లికేషన్స్‌ పెట్టుబడులు, రాంకీ, పెన్నా కేసుల విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అరబిందో, హెటిరోకు సంబంధించిన ఈడీ కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లలో కౌంటరు దాఖలుకు ఈడీ గడువు కోరింది.

ఓఎంసీ కేసులో విచారణకు తొలగిన అడ్డంకులు

ఓబుళాపురం మైనింగ్‌ కేసు (ఓఎంసీ)లో 6వ నిందితురాలిగా ఉన్న ఏపీ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి పాత్రపై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ, కర్ణాటక సరిహద్దు వివాదం తేలేదాకా విచారణ చేపట్టకుండా సీబీఐ కోర్టును ఆదేశించాలని, తనపై సీబీఐ నమోదుచేసిన కేసును ఎత్తేయాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తీర్పు వెలువరించారు. ‘ఓఎంసీకి లీజుల మంజూరులో నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో శ్రీలక్ష్మిని సీబీఐ నిందితురాలిగా చేర్చింది. దర్యాప్తు ప్రక్రియలో ప్రతి దశలో జోక్యం చేసుకుంటే సాధారణ ప్రక్రియ దెబ్బతింటుంది. దర్యాప్తు అధికారి దురుద్దేశపూర్వకంగా వ్యవహరించినప్పుడు, చట్ట నిబంధనల ఉల్లంఘనలు జరిగినప్పుడే ఈ ప్రత్యేక అధికారాన్ని వినియోగించాలి. ఓఎంసీ కేసు 2012లో నమోదైంది. 9 ఏళ్లయినా ఇంకా అభియోగాల నమోదు, డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ దశలోనే ఉంది. కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నిందితులకు అవకాశాలు ఇవ్వడం ముఖ్యమే. స్వల్ప కారణాలతో కేసు విచారణను ఆపకుండా కొనసాగించడమూ అంతే ముఖ్యం. ప్రస్తుత కేసును కొట్టేయాల్సిన ప్రత్యేకత ఏమీ లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని