కౌన్సెలింగ్‌తో ఆత్మహత్యలకు చెక్‌

ప్రధానాంశాలు

కౌన్సెలింగ్‌తో ఆత్మహత్యలకు చెక్‌

కుటుంబ మూలాల్లోకి వెళ్లి గమనించాలి

ఒత్తిడి ఎదుర్కొనే వర్గాలను ముందే గుర్తించాలి

జెనెటిక్‌ మార్కర్లతో నిర్ధారణ పరీక్షలు అవసరం

‘ఈనాడు’తో జీనోమ్‌ ఫౌండేషన్‌ రీసెర్చ్‌ డీన్‌ ఆచార్య వి.ఆర్‌.రావు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రేమ విఫలమైందని యువతీ యువకులు.. చదువుల్లో ఒత్తిడి పెరిగిందని విద్యార్థులు.. దీర్ఘకాల జబ్బులతో విసిగిపోయిన పెద్దలు.. అప్పులపాలైన ఉద్యోగులు, రైతులు.. ఇలా రకరకాల కారణాలతో నిత్యం ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇదే తరహా సమస్యలతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా కొందరు ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లడానికి కారణాలను పరిశోధకులు గుర్తించారు. ఆత్మహత్య కూడా ఒక రోగమేనని.. దీనికి చికిత్స కంటే కుటుంబ చరిత్ర, ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనే వర్గాలను గుర్తించి ముందే కౌన్సెలింగ్‌ చేయడం ద్వారా బలవన్మరణాలను తగ్గించవచ్చని సూచిస్తోంది జీనోమ్‌ ఫౌండేషన్‌. ఫౌండేషన్‌ రీసెర్చ్‌ డీన్‌ ఆచార్య వి.ఆర్‌.రావు ‘ఈనాడు’తో ఈ విషయాలను పంచుకున్నారు.


‘‘చదువు, వృత్తిపరమైన ఒత్తిడి, ఒంటరితనం, ప్రేమ, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యం, ఆర్థిక ఇబ్బందులతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఈ ఆత్మహత్యలకు జన్యుమూలాలపై హైదరాబాద్‌లోని మా ఫౌండేషన్‌ అధ్యయనం చేయగా.. కేంద్ర నాడీ వ్యవస్థలోని కొన్ని జన్యువులు ఇందుకు కారకాలని తేలింది. ఆత్మహత్యాయత్నం చేసిన, బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తుల కుటుంబ సభ్యులపై చేసిన పరిశోధనలో ప్రధానంగా ఆరు రకాల జన్యువుల్లో (ఐఎల్‌7, ఆర్‌హెచ్‌ఈబీ, సీటీఎన్‌ఎన్‌3, కేసీఎన్‌ఐపీ4, ఏఆర్‌ఎఫ్‌జీఈఈ3, ఎన్‌యూజీజీసీ) ఏడు మార్పులను గుర్తించాం. ఈ మార్పులున్న వారిలో ఎక్కువ మంది ప్రతికూల ఆలోచనలతో ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని తేలింది.

ఒత్తిడికి గురైనప్పుడు..

జన్యుపర లోపాలు ప్రధానంగా రెండు రకాలు. పుట్టుకతోనే వచ్చేవి ఒక రకం. సికిల్‌సెల్‌ అనిమియా, బీటా తలసీమియా వంటివి ఈ కోవలోకి వస్తాయి. జన్యుపరమైన చిన్న, చిన్న మ్యుటేషన్లతో వచ్చేవి రెండో రకం. చుట్టూ ఉండే వాతావరణం, జీవనశైలి, ఏదైనా ప్రభావానికి లోనైనప్పుడు రోగాలు బయటపడతాయి. టైప్‌-2 డయాబెటిస్‌, క్యాన్సర్‌, జీవనశైలి జబ్బులు ఈ కోవ కిందకు వస్తాయి. ఆత్మహత్య కూడా ఇందులో చేరిందని.. కుంగుబాటు(డిప్రెషన్‌)తో బాధపడుతున్నవారిలో ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మా అధ్యయనంలో తేలింది.

మూడో ప్రయత్నంలో 75 శాతం మంది..

మా అధ్యయనంలో 75 శాతం మంది మూడో ప్రయత్నంలో చనిపోతున్నారని గుర్తించాం. వీరిని ముందే గుర్తించి కౌన్సెలింగ్‌ చేయించవచ్చు. కుంగుబాటు లేనివారు సైతం బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. వీరిని గుర్తించేందుకూ పద్ధతులున్నాయి. ఆత్మహత్యలకు జన్యుపర సంబంధం ఉన్నట్లు తేలినందున డయాగ్నసిస్‌లో జెనెటిక్‌ మార్కర్లను సైతం ప్రవేశపెట్టాలి. ఇప్పటివరకు బాధితుల ప్రవర్తన, వారితో మాట్లాడటం, కౌన్సెలింగ్‌ వంటి పద్ధతుల్లో డయాగ్నసిస్‌ చేస్తున్నారు. ప్రత్యేకించి ఒత్తిడి ఎదుర్కొనే వృత్తుల్లో ఉన్న ఉద్యోగులు, విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు జెనెటిక్‌ మార్కర్లతో నిర్ధారణ పరీక్షలు అవసరం. మా ఫౌండేషన్‌లో ఇప్పటికే వీటిని చేస్తున్నాం. అందరికీ చేయడం వల్ల ఉపయోగం లేదు. కుటుంబ చరిత్ర ఆధారంగా ఆత్మహత్య రిస్క్‌ను ముందే గుర్తించి కౌన్సెలింగ్‌ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు’’ అని ఆచార్య వి.ఆర్‌.రావు వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని