ఈడీదీ అదే దారి!

ప్రధానాంశాలు

ఈడీదీ అదే దారి!

నిధుల మళ్లింపుపై లభించని ఆధారాలు

చర్చనీయాంశంగా ఆబ్కారీ అభియోగపత్రం

టాలీవుడ్‌ మత్తుమందుల కేసు

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో ఈడీ విచారణ పూర్తి కావడంతో దీని ముగింపు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఆధారాలు లేవని ఆబ్కారీశాఖ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణలోనైనా ఏమైనా తేలుతుందా అనేదానిపై చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈడీ విచారణలో నిధుల మళ్లింపునకు సంబంధించి సరైన ఆధారాలు లభించలేదని, ఇదీ ఆబ్కారీ దర్యాప్తు మాదిరిగానే ముగిసిపోనుందని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం నాటి బ్యాంకు లావాదేవీలన్నీ ఈడీ అధికారులు జల్లెడ పడుతున్నా అనుమానిత అంశాలేవీ వెల్లడి కాలేదని సమాచారం.

టాలీవుడ్‌ ప్రముఖులకు మత్తుమందులు సరఫరా చేశానని కెల్విన్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆబ్కారీశాఖ 2017లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పలువురు ప్రముఖులను ప్రశ్నించింది. మూడేళ్లకుపైగా దర్యాప్తు జరిపిన ఆబ్కారీశాఖ అధికారులు చివరికి వారిపై ఎలాంటి ఆధారాలు లభించలేదని గత ఏడాది డిసెంబరులో కెల్విన్‌పై దాఖలు చేసిన అభియోగపత్రంలో స్పష్టంచేశారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే అతడు టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు చెప్పి ఉండవచ్చనీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించి, పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు కెల్విన్‌ను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. దాని ఆధారంగా 12 మంది టాలీవుడ్‌ ప్రముఖులను విచారించారు. బుధవారం నటుడు తరుణ్‌ను ప్రశ్నించడంతో విచారణ ముగిసింది. సినీ ప్రముఖులకు కెల్విన్‌ మత్తుమందులు సరఫరా చేసినట్లు ఆధారాలు లభించలేదని ఆబ్కారీశాఖ చెబుతుండగా.. ఈడీ అధికారులు ప్రధానంగా నిధుల మళ్లింపు నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టారు. కెల్విన్‌తోపాటు విచారణకు పిలిపించిన వారి బ్యాంకు లావాదేవీలన్నీ తెప్పించి విశ్లేషించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకరిద్దరు సినీ ప్రముఖులకు ఎదురుగా కెల్విన్‌ను కూర్చోబెట్టి వారి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. వాట్సప్‌లో ప్రత్యేక గ్రూపులు పెట్టి అతడు మత్తుమందులు సరఫరా చేసేవాడని ఆబ్కారీ శాఖ అభియోగపత్రంలో పేర్కొంది. ఆ గ్రూప్‌లో సినీ ప్రముఖులు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు వంటి వివరాలేవీ అందులో ప్రస్తావించలేదు. ఇటువంటి సాంకేతిక అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కెల్విన్‌తో గాని, అతడి ముఠా సభ్యులతో గాని సినీ ప్రముఖులు ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించనట్లు సమాచారం.

సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ప్రస్తావనేదీ..

కెల్విన్‌ వాంగ్మూలంతోపాటు అనేక సాంకేతిక ఆధారాలు సేకరించామని అప్పట్లో ఆబ్కారీ అధికారులు అనధికారికంగా వెల్లడించారు. అతడి సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్లు తెప్పిస్తున్నామని, సినీ ప్రముఖులను కలిసినట్లు చెప్పేందుకు ఈ ఆధారం ఉపయోగపడుతుందని అనధికారికంగా పేర్కొన్నారు. మత్తుమందుల కోసం జరిగిన వాట్సప్‌ సంభాషణలూ సేకరించినట్లు ప్రచారం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు నేరస్థలం వద్ద నిందితుడు ఉన్నట్లు నిరూపించాలంటే అతడి సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ కీలకం. కానీ, కెల్విన్‌పై దాఖలు చేసిన అభియోగపత్రంలో ఇలాంటి వివరాలేవీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని