దిల్లీ న్యాయస్థానంలో కాల్పుల మోత

ప్రధానాంశాలు

దిల్లీ న్యాయస్థానంలో కాల్పుల మోత

పట్టపగలే రెచ్చిపోయిన గ్యాంగ్‌స్టర్లు

కోర్టు గదిలోనే ప్రత్యర్థి ముఠా నాయకుడి హత్య

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు దుండగుల మృతి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని రోహిణీ న్యాయస్థానంలో పట్టపగలే తుపాకుల మోత మోగింది. న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు చూస్తుండగానే శుక్రవారం మధ్యాహ్నం ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌ జితేంద్రమాన్‌ అలియాస్‌ గోగీని అతని ప్రత్యర్థులు హతమార్చారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో దాడికి పాల్పడిన దుండగులూ ప్రాణాలు విడిచారు.‘‘అండర్‌ ట్రయల్‌ ఖైదీ గోగీ హత్యకు గురయ్యారు. దాడి చేసిన ఇద్దరూ.. పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఇద్దరిలో ఒకరిపై రూ.50 వేల బహుమతిని కూడా గతంలో ప్రకటించాం’’ అని దిల్లీ పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన... రాజధానిలో ప్రకంపనలు సృష్టించింది. పట్టపగలే కోర్టు గదిలోకి దుండగులు ప్రవేశించి గోగీని హతమార్చడంతో న్యాయవాదులు, ఇతరులు భయాందోళనలకు లోనయ్యారు. కాల్పుల సమయంలో ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ మహిళా న్యాయవాది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రోహిణీ కోర్టు భద్రతపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు. గతంలోనూ ఈ న్యాయస్థానం ప్రాంగణంలో నాలుగైదు సార్లు కాల్పులు జరిగాయని.. అయినా పరిస్థితి మెరుగుపడలేదని ఓ న్యాయవాది తెలిపారు.

న్యాయవాదుల వేషాల్లో వచ్చి..

దాడి.. సినీఫక్కీలో జరిగింది. తిహాడ్‌ జైలులో ఉన్న గోగీని ఓ కేసు విచారణ కోసం పోలీసులు రోహిణీ కోర్టులోని 207 గదిలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో గోగీ ప్రత్యర్థి ముఠా నాయకుడు టిల్లూ తాజపురియాకు చెందిన అనుచరులు న్యాయవాదుల వేషాల్లో కోర్టులోకి చొరబడ్డారు. ‘‘గోగీ ప్రవేశించగానే న్యాయవాదుల దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఒక్కసారిగా పిస్టళ్లతో కాల్పులు ప్రారంభించారు. ఆ శబ్దాలు వినగానే గదిలోని వ్యక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. జడ్జి కూడా కోర్టు గది వెనుక ఉన్న తన కార్యాలయంలోకి వెళ్లి దాక్కున్నారు’’ అని న్యాయవాది సునీల్‌ తోమర్‌ తెలిపారు. గోగీ శరీరంలోకి పది తూటాలు దూసుకుపోయాయి. అప్రమత్తమైన దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఎదురు కాల్పులు జరిపి.. సాయుధులిద్దరిని హతమార్చారు. గోగీని ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు.

ఒకప్పటి ప్రాణస్నేహితులే..

జితేంద్ర గోగీ.. ప్రత్యర్థి టిల్లూ తాజపురియా ఒకే కళాశాలలో చదివారు. ఇద్దరూ ప్రాణమిత్రులు. 2010లో కళాశాల ఎన్నికల్లో ఏర్పడిన  వైరం.. తర్వాత గ్యాంగ్‌వార్‌గా మారింది.


రోహిణీ ఘటనపై సీజేఐ ఎన్‌.వి.రమణ ఆందోళన

దిల్లీలోని రోహిణీ న్యాయస్థానంలో కాల్పుల ఘటనపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడారు. ఈ ఘటన కోర్టు కార్యకలాపాలపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. కోర్టు ప్రాంగణాలు, జ్యుడీషియల్‌ సిబ్బంది రక్షణ, భద్రతకు సంబంధించిన పిటిషన్‌ ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, ‘రోహిణీ’ హింస నేపథ్యంలో దీనిపై వచ్చే వారమే విచారణ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని