ఎయిర్‌బస్‌తో రూ.21 వేల కోట్ల ఒప్పందం

ప్రధానాంశాలు

ఎయిర్‌బస్‌తో రూ.21 వేల కోట్ల ఒప్పందం

భారత వాయుసేనకు 56 రవాణా విమానాల కొనుగోలు

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భాగస్వామ్యంతో ఉత్పత్తి

దిల్లీ: పర్వత ప్రాంతాలు, ప్రతికూల పరిస్థితులు ఉండే భూభాగాల్లోకి సులువుగా సైనికులు, సామగ్రిని చేరవేసేలా భారత వైమానిక దళ రవాణా సామర్థ్యం భారీగా మెరుగుపడనుంది. 56 అధునాతన ‘సి-295’ విమానాలు మన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఇందుకోసం దాదాపు రూ.21వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని రక్షణ శాఖ శుక్రవారం లాంఛనంగా ఎయిర్‌బస్‌ సంస్థతో కుదుర్చుకుంది. వైమానిక దళంలోని కాలంచెల్లిన ఆవ్రో-748 లోహవిహంగాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కింద దేశంలో తొలిసారిగా ఒక ప్రైవేటు కంపెనీ.. సైనిక విమానాన్ని తయారుచేయనుంది. ఈ ఒప్పందానికి రెండు వారాల కిందట భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద మొదటి 16 విమానాలను ఎయిర్‌బస్‌.. స్పెయిన్‌లోని తన కర్మాగారం నుంచి నేరుగా సరఫరా చేస్తుంది. మిగతా 40 లోహ విహంగాలను భారత్‌లో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌) ఉత్పత్తి చేస్తుంది. ఒప్పందం కుదిరిన నాటి నుంచి పదేళ్లలోపు అవి అందుతాయి. టీఏఎస్‌ఎల్‌ ప్రధానంగా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థకు, ఎయిర్‌బస్‌కు మధ్య పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.

ఏవియేషన్‌ ప్రాజెక్టులకు ద్వారాలు

తాజా పరిణామాన్ని టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా స్వాగతించారు. దేశంలో ఏవియేషన్‌, ఏవియానిక్స్‌ ప్రాజెక్టులకు ద్వారాలు తెరిచే దిశగా ఇది పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన దేశీయ విడిభాగాల సరఫరా వ్యవస్థను ఇది సృష్టిస్తుందని చెప్పారు. సి-295 విమానాలను పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. భారత్‌లో ఏరోస్పేస్‌ వ్యవస్థ మరింతగా వృద్ధి చెందడానికి ఈ కాంట్రాక్టు దోహదపడుతుందని ‘ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌’ సీఈవో మైఖేల్‌ ష్కోల్‌హార్న్‌ చెప్పారు. దీనివల్ల వచ్చే పదేళ్లలో దేశంలో పెట్టుబడులకు తోడు ప్రత్యక్షంగా 15వేల నైపుణ్య ఉద్యోగాలు, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఈ ఒప్పందం.. టాటా సంస్థకు గర్వకారణమని, భారత సైనిక తయారీ వ్యవస్థకు ఒక మైలురాయి అని టీఏఎస్‌ఎల్‌ ఎండీ సుకరణ్‌ సింగ్‌ చెప్పారు.


ప్రత్యేకతలు..

* సి-295.. అధునాతన మధ్యతరహా బహుళ ప్రయోజన విమానం. ఇది అనేకరకాల సేవలను అందించగలదు.

* చిన్నపాటి, సాఫీగా లేని రన్‌వేలపైనా ఇది దిగగలదు. యుద్ధరంగంలో వేగంగా స్పందించడానికి వీలుగా దీనికి వెనుకభాగంలో తలుపు అమర్చారు. దీనిద్వారా గాల్లోనే బలగాలు, సరకులను పారాచూట్లతో జారవిడిచే వీలుంది.

* ఉష్ణ, ఎత్తయిన ప్రాంతాలకు ఎక్కువ బరువును మోసుకెళ్లేందుకు వీలుగా ఈ విమానం రెక్కలను తీర్చిదిద్దారు. దీనివల్ల ఇంధన వినియోగం 4 శాతం మేర తగ్గుతుంది.

* ఈ విమానాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థ (ఈడబ్ల్యూఎస్‌) ఉంటుంది.

* ఏకబిగిన సి-295 ప్రయాణించగలిగే సమయం: 11 గంటలు

* పరిధి: 2వేల నాటికల్‌ మైళ్లు (6 టన్నుల బరువుతో)

* రవాణా సామర్థ్యం: 71 మంది సాధారణ సైనికులు లేదా కార్గోతో కూడిన 50 మంది పారాట్రూపర్లు

* కాక్‌పిట్‌: పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. టచ్‌ స్క్రీన్‌ నియంత్రణలు ఉంటాయి. 

* ఈ విమానాలకు సంబంధించిన అనేక భాగాలు, ప్రధాన వ్యవస్థలు, ఏరోస్ట్రక్చర్‌లు భారత్‌లోనే ఉత్పత్తి అవుతాయి.

* ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) కూడా ఇందులో పాలుపంచుకుంటాయి.

* ఈ విమానాల సర్వీసింగ్‌ కోసం ప్రత్యేక కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు.

* సహాయ, గాలింపు చర్యలు, అక్రమ వలసల పర్యవేక్షణ; మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌, సముద్ర దొంగతనాల నియంత్రణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సరకులు చేరవేయడం వంటి పౌర అవసరాలకు సి-295ను వాడొచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని