పాలమూరు-రంగారెడ్డికి అనుమతులివ్వండి

ప్రధానాంశాలు

పాలమూరు-రంగారెడ్డికి అనుమతులివ్వండి

కృష్ణా జల వివాదాన్ని ట్రైబ్యునల్‌కు అప్పగించండి

 కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు సీఎం వినతి

నేడు ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్న కేసీఆర్‌

ఈనాడు, దిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల పంపిణీ వివాద పరిష్కార అంశాన్ని త్వరగా ట్రైబ్యునల్‌కు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం ఈ అంశాన్ని ట్రైబ్యునల్‌కు అప్పగించాలని కోరారు. అధికార పర్యటన నిమిత్తం దిల్లీకొచ్చిన సీఎం శనివారం షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 2.46 గంటల వరకు భేటీ అయ్యారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి వెంట మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల కరవు జిల్లా మహబూబ్‌నగర్‌కు జరిగే నష్టం గురించి ఈ ఎమ్మెల్యేల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిసింది. దుర్భిక్షంతో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి వరప్రదాయిని లాంటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని, ఇబ్బందులు లేకుండా నీటిని కేటాయించాలని కూడా కోరినట్లు సమాచారం. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌ అమలు తేదీని అక్టోబరు 14 కాకుండా మరికొంత సమయం వాయిదా వేయాలని అడిగినట్లు తెలిసింది. కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను వేగంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికే వాటికి పర్యావరణ అనుమతులు వచ్చినందున డీపీఆర్‌లను క్లియర్‌ చేయాలని కోరారు. ‘‘జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ నీరు కార్యక్రమం అమలు, ఇతర అంశాలను మేము చర్చించాం’’ సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం షెకావత్‌ ట్వీట్‌ చేశారు.

అమిత్‌ షా నేతృత్వంలో నేడు సమావేశం

ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగే తీవ్రవాద ప్రభావిత ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే ఈ భేటీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సన్నద్ధత, గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల అనుసంధానం, ఇదివరకు ఇచ్చిన నిధుల వినియోగం ఎంతవరకు వచ్చింది? విద్య సౌకర్యాల కల్పన, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు ఎజెండా అంశాలుగా పొందుపరిచినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం, ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానం గురించే ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు తెలిసింది. సారపాక, ఏటూరునాగారం, తుపాకులగూడెం, గోదావరి, ప్రాణహిత నదుల మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా చివరనున్న కౌటాల వరకు రహదారులు, గోదావరి నదిపైన వంతెనలు నిర్మించాలని కోరనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని అడగనున్నట్లు తెలిసింది.


సీఎంతో ఎంపీల భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెరాస ఎంపీలు శనివారం ఇక్కడ భేటీ అయ్యారు. లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, బి.వెంకటేష్‌నేత సీఎంతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని