ధరణి వెతలపై దృష్టి

ప్రధానాంశాలు

ధరణి వెతలపై దృష్టి

ఉప సంఘం సమావేశం నేపథ్యంలో కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్లో సరైన ఐచ్ఛికాలు లేక  రైతులు, యజమానులు హక్కులకోసం తిప్పలు పడుతుండగా యంత్రాంగం అలాంటి వాటిని గుర్తించే పనిలో పడింది. పట్టా భూమిని అసైన్డ్‌గా చూపడం, చాలా జిల్లాల్లో ఇనాం భూముల సర్వే నంబర్లు, ఖాతాలు అసలు ధరణిలో లేకపోవడం.. ఇలా దాదాపు 20కిపైగా కీలక సమస్యలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్యలపై ఇటీవల ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీకి సమాచారం అందించేందుకు జిల్లాల్లో యంత్రాంగం సమస్యలను గుర్తించే ప్రక్రియను చేపడుతోంది.

జిల్లాల్లో గుర్తించిన భూ సమస్యలు, ఐచ్ఛికాలు లేని కీలక సమస్యల్లో కొన్ని...

* సేత్వార్‌, ఖాస్రా పహాణీలోని మూల సర్వే నంబర్లలో వాస్తవ విస్తీర్ణం కన్నా కొత్త పాసుపుస్తకాల్లో విస్తీర్ణం పెరగడం లేదా తగ్గిపోవడం.

* అసైన్డ్‌ భూములకు చెందిన కొన్ని సర్వే నంబర్లు పట్టా భూములుగా నమోదవడం.

* పట్టా లేదా ప్రభుత్వ భూమి అని భూ స్వభావాన్ని తెలిపే వివరాలు లేవు.

* ఏ ప్రయోజనాలకు భూ సేకరణ చేపట్టారో గుర్తించే వీలు లేదు. దీని వల్ల భూమి వారసత్వ బదిలీ సమయంలో ఇబ్బందులు ఉన్నాయి.

* భూమికి సంబంధం లేని వారి పేర్లు కూడా పాసుపుస్తకాల్లో పట్టాదారుల కింద నమోదయి ఉన్నాయి.

* విస్తీర్ణం ఎక్కువ లేదా తక్కువగా నమోదైన సంఘటనల్లో పలు సర్వే నంబర్లు కనిపించడం లేదు.

* సాగులో లేని భూములను 99999 నంబరుతో నోషనల్‌ ఖాతా కింద చేర్చారు. వాటిని పట్టాదారులకు బదిలీ చేయాల్సి ఉంది.

* ఇనాం పట్టాదారులకు ఓఆర్‌సీ పత్రాలు జారీ చేయాలి. కొన్ని చోట్ల సర్వే నంబర్లు, ఖాతాలు ఆన్‌లైన్‌ నుంచి తొలగించారు.

* గతంలో ఖాతాలు ఉండి ఇప్పుడు సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించని రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందడం లేదు.

* నిషేధిత జాబితాలోకి ఎక్కని భూములను గుర్తించి నమోదు చేయాలి.

* భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో అధికారులు ఎన్‌కంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) పరిశీలించే వెసులుబాటు ధరణిలో లేదు.

* వ్యవసాయ భూములకు ఈసీ, మార్కెట్‌ ధర ధ్రువీకరణ మీసేవా కేంద్రాల్లో అందుబాటులో లేదు.

* మ్యుటేషన్‌ ఐచ్ఛికం అందుబాటులో లేదు.

* యాజమాన్య హక్కు పరిష్కారం అయిన ఇనాం భూములకు కొత్తగా ఓఆర్‌సీ జారీకి అవకాశం లేదు.

* రెండు ఖాతాలు నమోదైన యజమానులకు అవి తొలగించి ఒకటి కొనసాగించే అవకాశం లేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని