రూ.124 కోట్ల ప్రాజెక్టు.. రూ.700 కోట్లకు

ప్రధానాంశాలు

రూ.124 కోట్ల ప్రాజెక్టు.. రూ.700 కోట్లకు

భారీగా పెరిగిన ‘మోదికుంట వాగు’ నిర్మాణ వ్యయం

ఈనాడు హైదరాబాద్‌: ప్రాజెక్టుల పనుల్లో జాప్యంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. వందశాతం.. రెండువందల శాతం కాదు ఓ మధ్యతరహా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఏకంగా దాదాపు 600 శాతం పెరిగింది. 2005లో రూ.124.60 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పుడు రూ.700.20 కోట్లకు చేరింది. ఎకరా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు అయ్యే ఖర్చులో ఈ ప్రాజెక్టుదే రికార్డు కానుంది. జలయజ్ఞంలో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలంలోని కృష్ణాపురం వద్ద మోదికుంట మధ్యతరహా ప్రాజెక్టును 2005లో ప్రభుత్వం చేపట్టింది. రూ.124.60 కోట్లతో పరిపాలనా అనుమతి ఇవ్వగా, 2005 జులైలో రూ.118.95 కోట్లకు పనిని గ్యామన్‌ ఇండియా కంపెనీకి అప్పగించారు. మొత్తం 13,591 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలన్నది ఒప్పందం.

2009లో సూత్రప్రాయ అనుమతి వచ్చినా...

ఈ ప్రాజెక్టు వల్ల 1,233 ఎకరాల అటవీ భూమి ముంపునకు గురవుతుండటంతో, రెండో దశ అటవీ అనుమతి రావడంలో సమస్య ఏర్పడింది. మోదికుంట వాగులో 3.716 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, ఈ ప్రాజెక్టు ద్వారా 2.142 టీఎంసీలు వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం 1,259 మీటర్ల పొడవుతో 44.315 మీటర్ల ఎత్తు మట్టికట్ట నిర్మించాలని నిర్ణయించారు. 2009లో కేంద్ర జల సంఘం ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ అనుమతి ఇచ్చినా ముందుకు సాగలేదు. గడవు పొడిగించడం, పనులు జరగకపోవడం ఇలా పదిహేను ఏళ్లుగా కాగితాల్లోనే మనుగడ కనిపిస్తోంది. భూసేకరణ తదితర పనులకు ఇప్పటిదాకా సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేశారు.

గోదావరి బోర్డుకు చేరిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక

2018-19 ధరల ప్రకారం నిర్మాణ వ్యయాన్ని రూ.531.77 కోట్లుగా అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదికను గోదావరి బోర్డుకు నీటిపారుదల శాఖ అందజేసింది. దీని ప్రకారం నిర్మాణ వ్యయం రూ.700.20 కోట్లు. గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. అనుమతి తీసుకొని మూడు, నాలుగు నెలల్లో పనులు ప్రారంభించినా పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లు పట్టవచ్చు. అప్పటికి దీని నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని