మూలాలు మరవని మహనీయుడు నోరి

ప్రధానాంశాలు

మూలాలు మరవని మహనీయుడు నోరి

డాక్టర్‌ దత్తాత్రేయుడు ఆత్మకథ గ్రంథావిష్కరణలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రశంస

ఈనాడు, దిల్లీ, నారాయణగూడ, న్యూస్‌టుడే: ప్రఖ్యాత కేన్సర్‌ వైద్యులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరవని మహనీయుడని ఆయనను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు. మూర్తీభవించిన మానవత్వానికి నిదర్శనమైన ఆయన ఏడు పదుల జీవితాన్ని, ఎన్నెన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనాన్ని ‘ఒదిగిన కాలం’ పేరుతో ఆత్మకథను మనకందించి తెలుగు సమాజానికి ఎంతో మేలుచేశారని అన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగ్గా, జస్టిస్‌ రమణ దిల్లీ నుంచి వీడియో ద్వారా మాట్లాడారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, కిన్నెర కల్చరల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, శ్రీశ్రీ ప్రింటర్స్‌-సాహితీ మిత్రుల ఆధ్వర్యాన  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. అరుణ పప్పు ఈ పుస్తకానికి రచనా సహకారం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో విశ్వయోగి విశ్వంజీ మహారాజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్‌ రమణ మాట్లాడుతూ... ‘‘ఈ 230 పేజీల పుస్తకం నేను ఇటీవలి కాలంలో ఆపకుండా ఆమూలాగ్రం చదివిన వాటిలో ఒకటి. మానవసేవే మాధవ సేవ అనే నానుడిని సులువుగా బోధపరిచే ఈ పుస్తకం సందేశాత్మకమే కాకుండా గొప్ప విజ్ఞాన ప్రదాయిని కూడా.

నాకూ ఇలాంటి పరీక్షలు ఎన్నో ఎదురయ్యాయి

ఇంత పెద్ద మనిషికీ నీలాపనిందలు తప్పలేదు. పుస్తకం 125వ పేజీలో తనపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై రెండేళ్లుసాగిన విచారణ గురించి చెప్పారు. ఓర్పుగా ఉండి అగ్ని పరీక్షలో పునీతమైన సీతలా బయటపడిన వైనాన్ని ఒకింత బాధతో ఏకరువుపెట్టారు. నాకూ ఇలాంటి పరీక్షలు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. ఆయన అనుభవించిన క్షోభను నేను అర్థం చేసుకోగలను. సత్యం గెలిచి తీరుతుంది’’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి నోరి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ సాహితీవేత్త డా.ఓలేటి పార్వతీశం తదితరులు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పుస్తకం చదువుతుంటే కళ్లు చెమర్చాయి

బాల్యంలో ఎదురైన ఇబ్బందులు, మాతృమూర్తి చేసిన త్యాగాలు, కుటుంబ వాత్సల్యం, బంధుమిత్రుల తోడ్పాటు గురించి నోరి వారి వర్ణన చదువుతుంటే కళ్లు చెమర్చాయి. 1989 నవంబరు 25న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మాట్లాడుతూ ‘తెలుగు వారికి నేను హీరో కావచ్చు. కానీ వైద్యరంగంలో ఉంటూ, కేన్సర్‌  మహమ్మారితో పోరాడే జనాల ప్రాణాలను కాపాడే అసలైన హీరో డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు’ అన్నారు. ఆ మాటలు అక్షర సత్యం. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. నోరివారి నోరూ, హస్తవాసి రెండూ మంచివే. అందుకే ప్రపంచంలో ఏమూలకేగినా ఆయన వైద్య స్పర్శతో రెండో జీవితాన్ని పొందినవారెందరో తారసపడతారు.

- సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని