కొంపలు అంటించి.. మంటలార్పుతున్నట్లు నటనా?

ప్రధానాంశాలు

కొంపలు అంటించి.. మంటలార్పుతున్నట్లు నటనా?

 పాక్‌ వక్రబుద్ధికి గట్టిగా బదులిచ్చిన భారత దౌత్యవేత్త

 నెట్టింట్లో స్నేహా దూబేపై ప్రశంసల వర్షం

ఐరాస: అంతర్జాతీయ వేదికపై భారత్‌ మీద మరోసారి అక్కసు వెళ్లగక్కి ఆడిపోసుకోవాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. కశ్మీర్‌, ఉగ్రవాద బెడద వంటి అంశాలపై అబద్ధాలను గుమ్మరిస్తూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన ప్రస్తావనలను యువ దౌత్యవేత్త స్నేహా దూబే సమర్థంగా తిప్పికొట్టారు. కొంపకు నిప్పంటించి ఆ మంటలను ఆర్పుతున్నట్లుగా పొరుగుదేశం నటిస్తోందని కడిగి పారేశారు. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరీ దూబే అంటూ ఆసక్తితో ఆరా తీస్తున్నారు.

హక్కుల ఉల్లంఘన: పాక్‌ ప్రధాని

ఐరాస సర్వ ప్రతినిధి సభ (యూఎన్‌జీఏ)ను ఉద్దేశించి శనివారం ఇమ్రాన్‌ఖాన్‌ వీడియో ద్వారా 25 నిమిషాల సేపు మాట్లాడారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ మృతి వంటి అంశాలు ప్రస్తావించారు. ‘మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల ప్రపంచ వైఖరి అసమానంగా ఉంది. భారత్‌లో వివక్షతో కూడిన పౌరసత్వ చట్టాల వల్ల 20 కోట్ల మంది ముస్లింలు భయాందోళనలో ఉన్నారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. పాకిస్థాన్‌ శాంతి కోరుకుంటోంది. అందుకు సహకరించాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉంది’ అని అన్నారు. ‘‘అమెరికా కృతజ్ఞతలేమి, అంతర్జాతీయ ద్వంద్వ వైఖరి’’ వల్ల పాకిస్థాన్‌ బలైందని అన్నారు. అమెరికాకు సాయం చేసినందుకు తామే నష్టపోయామని చెప్పారు. ‘అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితులకు అమెరికా, ఐరోపా నేతలు పాకిస్థాన్‌ను నిందిస్తున్నారు. కానీ, 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై అమెరికా జరిపిన యుద్ధంలో పాల్గొన్నందుకు అఫ్గాన్‌ తర్వాత ఎక్కువగా నష్టపోయింది మా దేశమే. ఇంత చేసినా మాకు ప్రశంసల బదులు, అపనిందలే వస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

ప్రపంచం మొత్తానికి నష్టం: భారత్‌

ఇమ్రాన్‌ ప్రసంగంపై దూబే స్పందిస్తూ.. కశ్మీర్‌ సహా అక్కడి పాక్‌ ఆక్రమిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదులను పెంచి పోషించే ఆ దేశ చర్యలతో ప్రపంచం మొత్తం నష్టపోయిందన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలు పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. కశ్మీర్‌లో పాకిస్థాన్‌ ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఐరాస భద్రత మండలి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇచ్చింది. పెరటిలోనే ఉగ్రవాదులను పెంచే ఆ దేశ చర్యలతో ప్రపంచం మొత్తం నష్టపోయింది. ఈ విషయం సభ్య దేశాలకు తెలుసు. ఇతరుల అంతర్గత విషయాలపై మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని చెప్పారు. ‘పాకిస్థాన్‌.. తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకొంటోంది. ఇంటికి నిప్పు పెట్టి ఆ మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంది.. అమెరికా జంట భవనాలపై ఉగ్రదాడికి పాల్పడిన ఒసామా బిన్‌లాడెన్‌కు పాక్‌ ఆశ్రయమిచ్చింది. తప్పులన్నీ తనవైపు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. ఇలాంటి వేదికల్ని దుర్వినియోగం చేస్తోంది’ అని ఆమె చెప్పారు. పాక్‌లో, భారత్‌లో మైనారిటీల పరిస్థితి మధ్య ఎలాంటి తేడా ఉందో ఉదాహరణలతో వివరించారు. బక్కపల్చగా ఉన్నా.. ఘాటుగా ఇచ్చిన ఆమె సమాధానం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సివిల్స్‌ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)కు దూబే ఎంపికయ్యారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆమె మొదటి పోస్టింగ్‌ విదేశాంగ శాఖలో. ప్రస్తుతం ఐరాసలో భారతదేశ ఫస్ట్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలోనూ యువ దౌత్యవేత్తలు పలు అంతర్జాతీయ వేదికలపై పాక్‌ దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టి ప్రశంసలు అందుకున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని