117 ఎకరాల ఈ-వేలం వాయిదా

ప్రధానాంశాలు

117 ఎకరాల ఈ-వేలం వాయిదా

కోర్టుల్లో అభ్యంతరాలతో ప్రభుత్వ నిర్ణయం
కేసుల పరిష్కారం తర్వాత తిరిగి వేలం వేస్తామని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మలి విడత భూముల వేలాన్ని వాయిదా వేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన భూముల వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచారశాఖ ముఖ్యకార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, గండిపేట మండలాల్లోని ఖానామెట్‌(22.79 ఎకరాలు), పుప్పాలగూడ(94.56 ఎకరాలు) గ్రామాల పరిధిలో 35 ల్యాండ్‌ పార్సిళ్లలో మొత్తం 117.35 ఎకరాల భూముల్ని ఈ-వేలం ద్వారా విక్రయించడానికి గత నెల 30న ప్రకటన ఇచ్చారు. టెండర్ల పక్రియ 28న ముగియాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొంతమంది ప్రభుత్వ భూములపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ భూముల యజమాన్యహక్కులకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కొందరు భూములపై కేసులు వేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చేయడంతో పాటు ఈ భూములకు సంబంధించిన న్యాయ వివాదాలను సత్వరం పరిష్కరించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. కోర్టుల ముందున్న పెండింగ్‌ కేసుల్ని పరిష్కరించి వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.

రూ.3 వేల కోట్ల ఆదాయం అంచనా

హెచ్‌ఎండీఏ మొదటి విడతగా కోకాపేట వద్ద 49.9 ఎకరాల భూమిని వేలం వేయగా రూ.2,000 కోట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో మలి విడత భూముల వేలం ద్వారా కనీసం రూ.3000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది భూములు అమ్మకం ద్వారా మొత్తం రూ.20 వేల కోట్లను సమీకరించుకోనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని