కోర్టుల్లో 50% మహిళా రిజర్వేషన్‌ సాకారమవ్వాలి

ప్రధానాంశాలు

కోర్టుల్లో 50% మహిళా రిజర్వేషన్‌ సాకారమవ్వాలి

అది దానం కాదు... మీ హక్కు
మహిళా న్యాయవాదుల సంఘం సన్మాన సభలో సీజేఐ జస్టిస్‌ రమణ

ఈనాడు, దిల్లీ: ‘‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి... (పోరాడితే) పోయేదేం లేదు... సంకెళ్లు తప్ప అని కార్ల్‌మార్క్స్‌ పిలుపునిచ్చారు. ఇప్పుడు దాన్ని కొంత మార్చి ప్రపంచ మహిళలారా ఏకం కండి... (పోరాడితే) పోయేదేమీలేదు సంకెళ్లు తప్ప అని చెబుతున్నా’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. మహిళలంతా గట్టిగా డిమాండ్‌ చేసి 50% రిజర్వేషన్లు సాధించుకోవాలని, అదేమీ ఎవరో ఇచ్చే దానం కాదు.. హక్కు అని స్పష్టంచేశారు. కొత్తగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టిన 9 మంది న్యాయమూర్తుల కోసం సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఆదివారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఆరోజు నేను ఎక్కడున్నా సంతోషిస్తాను

‘‘ఎప్పుడోసారి మనం అన్ని కోర్టుల్లో 50% మహిళా రిజర్వేషన్ల లక్ష్యాన్ని సాకారం చేసుకుంటామని నమ్ముతున్నాను. ఆరోజు నేను ఎక్కడున్నా సంపూర్ణంగా సంతోషిస్తాను. దేశవ్యాప్తంగా కిందిస్థాయి న్యాయవ్యవస్థలో 30% లోపే మహిళా న్యాయాధికారులు ఉన్నారు. హైకోర్టుల్లో అది 11.5%కి పరిమితమైంది. సుప్రీంకోర్టులో ప్రస్తుత నలుగురు మహిళా న్యాయమూర్తులతో కలిపి 11-12% ప్రాతినిధ్యం లభించినట్లయింది. 17 లక్షల మంది న్యాయవాదుల్లో 15% మాత్రమే మహిళలున్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో ఒక్క మహిళా సభ్యురాలికీ ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లాను.

మౌలిక సదుపాయాలు అవసరం

అసౌకర్య వాతావరణం, కిక్కిరిసిపోయిన కోర్టు గదులు, మరుగుదొడ్ల కొరత, కూర్చోవడానికి తగినంత స్థలం లేకపోవడం లాంటివి మహిళా న్యాయవాదులను ఇబ్బంది పెడుతున్నాయన్న విషయంతో నేను ఏకీభవిస్తున్నా. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ‘జాతీయ న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల సంస్థ’ను ఏర్పాటు చేయాలని పదేపదే కోరుతున్నా. దేశవ్యాప్తంగా 6,000 పైగా కోర్టుల్లో 22% చోట్ల మహిళలకు మరుగుదొడ్లే లేవు. దీనివల్ల మహిళా న్యాయాధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను కొన్ని   సమస్యలను కార్యనిర్వాహక వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లి తక్షణం వాటిని సరిదిద్దమని  ఒత్తిడి చేస్తున్నా.

దసరా తర్వాత భౌతిక విచారణలు

కోర్టుల్లో భౌతిక విచారణ మొదలుపెట్టడానికి యువ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నా, మెజార్టీ సీనియర్‌ న్యాయవాదులే సుముఖత చూపడం లేదు. ప్రామాణిక నిబంధనలపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినందున వాటిని సవరించి, మరింత సరళంగా జారీ చేస్తాం. వైద్య హెచ్చరికల నేపథ్యంలో కోర్టులను పూర్తిగా తెరవాలనుకోవడంలేదు. కిక్కిరిసిపోయిన కోర్టు గదుల్లో వైరస్‌ వ్యాపిస్తే.. ఇలాంటి చర్యల వల్లే మరో ఉద్ధృతి వచ్చిందని ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దసరా తర్వాత క్రమంగా భౌతిక విచారణ ప్రారంభిస్తాం. న్యాయమూర్తులు కొంత ఎత్తులో, అద్దాల మధ్య కూర్చొని ఉంటారు కాబట్టి వారికి పెద్ద సమస్య ఏమీ ఉండదు. న్యాయవాదులు, వారి గుమస్తాలకే ఇబ్బంది అన్నది గుర్తించాలి.

లా స్కూళ్లలోనూ రిజర్వేషన్లు ఉండాలి

దేశంలోని అన్ని లా స్కూళ్లలో మహిళలకు నిర్దిష్టమైన రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌కూ నేను మద్దతిస్తున్నాను. అప్పుడు ఎక్కువమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి వీలవుతుంది. మహిళా న్యాయవాదులంతా సమాజానికి స్ఫూర్తి ప్రదాతలే. మీ విజయగాథలు భావితరాలకు మార్గదర్శకాలవుతాయి. ఎక్కువమంది మహిళలు ఇందులోకి రావడానికి ప్రోత్సహించినట్లవుతుంది. తద్వారా న్యాయవ్యవస్థలో 50% మహిళా ప్రాతినిధ్యం సాధించడానికి వీలవుతుంది. నేను ఇక్కడ ఉన్నంతవరకు మహిళా సమస్యల పరిష్కారానికి మద్దతిస్తూనే ఉంటాను’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.


సీజేఐ గొప్ప దక్షత ఉన్న వ్యక్తి: జస్టిస్‌ నరసింహ

న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ మాట్లాడుతూ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే జస్టిస్‌ రమణ కార్యాచరణ, దార్శనికతలతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఏకకాలంలో 17 కోర్టులు నడవడం అసాధారణం, నమ్మశక్యంకాని విషయం అన్నారు. ఇది సీజేఐకున్న గొప్ప దక్షతను చాటుతోందన్నారు.  తాను న్యాయవాది నుంచి న్యాయమూర్తినైనా ఇప్పటికీ న్యాయవాదిననే అనిపిస్తుంటుందని చమత్కరించారు. ‘ప్రతిరోజూ నేను నిద్రించేటప్పుడు జడ్జిగానే ఉంటాను. ఉదయం లేచినప్పుడు మాత్రం న్యాయవాదినని అనిపిస్తుంది. అందుకే మొదట ఏ కోర్టులో కేసు వాదించాలా అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతాను. తర్వాత నేనెవరినో గుర్తుకు వస్తుంది’ అని ఆయన చెప్పినప్పుడు సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.


నేను సీజేఐనైతే ఆ గౌరవం జస్టిస్‌ రమణదే: జస్టిస్‌ నాగరత్న

స్టిస్‌ బీవీ నాగరత్న మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం తనకు ఉందంటే ఆ గౌరవమంతా సీజేఐ జస్టిస్‌ రమణకు, కొలీజియం సభ్యులకే దక్కుతుందని పేర్కొన్నారు. జస్టిస్‌ హిమా కోహ్లి మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు   ఒకేసారి తొమ్మిదిమంది న్యాయమూర్తులు, అందులోనూ ముగ్గురు మహిళలు నియమితులయ్యేలా చేసి సీజేఐ అద్భుతమైన పనితీరు కనబరిచారన్నారు. కార్యక్రమంలో జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లనూ సన్మానించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని