పంచాయతీ కార్యదర్శులకు బడి పిల్లల బాధ్యత

ప్రధానాంశాలు

పంచాయతీ కార్యదర్శులకు బడి పిల్లల బాధ్యత

రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామాల్లో పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లేలా ఆయా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సూచించింది. నూరుశాతం హాజరు, సున్నా డ్రాపవుట్లు లక్ష్యంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరింది. అక్షరాస్యత, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కేంద్రాలైన పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలంది. గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికే అందుబాటులో గల 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు త్వరలో విడుదల చేయనున్న 15వ ఆర్థిక సంఘం నిధులనూ ఖర్చుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తులు, భవనాల నిర్వహణ చేపట్టాలని, ఆర్థిక సంఘం నిధులతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఎరువుల కేంద్రాలకు వాడుకోవాలని కేంద్రం తెలిపింది.

‘‘విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పాఠశాలకు ప్రాధాన్యమివ్వాలి. పాఠశాలల భవనాల నిర్వహణ, తాగునీటి సరఫరా, చేతులు కడుక్కునే స్థలాలు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, క్రీడామైదానాల అభివృద్ధికి ఖర్చుచేయాలి. గ్రామ విద్యా కమిటీల సహాయంతో గ్రామాభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా పాఠశాలల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి. విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకానికి అవసరమైన సహాయాన్ని కమిటీలు చేయాలి. వైద్యఆరోగ్యశాఖలతో కలిసి ఆరోగ్యశిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యస్థితిని తెలుసుకోవాలి. పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించి, పనితీరు నివేదికను పంచాయతీరాజ్‌, విద్యాశాఖలకు పంపించాలి’’ అని కేంద్రం సూచించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని