హలధారికి అండాదండా

ప్రధానాంశాలు

హలధారికి అండాదండా

అన్నదాతలను ఆదుకొంటున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
తక్కువ వడ్డీకి రుణాలు, పంటలకు గిట్టుబాటు ధర
విజయపథంలో ఎఫ్‌పీవోలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ఓ ఏడాది కరవు.. మరో ఏడాది అకాల వర్షాలు.. ధరలున్నప్పుడు తెగుళ్లు.. పంటలు సమృద్ధిగా పండినప్పుడు ధరాఘాతం.. విపణిలో దళారుల దందాలు.. ఇవన్నీ హలధారికి అప్పులు మిగుల్చుతున్నాయి. ఇలాంటి తరుణంలో రైతులు సంఘటితమైతే కలిగే ప్రయోజనాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) కళ్లకు కడుతున్నాయి. అన్నదాతల ఆదాయం పెంచడంతో పాటు పెట్టుబడుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించడం, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ఈ సంఘాలు కృషి చేస్తూ మన్ననలు పొందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏర్పాటై రాష్ట్ర సర్కార్‌ చొరవతో రాష్ట్రంలో పలు సంఘాలు రాణిస్తున్నాయి.

సహకార సంఘాలకు భిన్నంగా..

ఎఫ్‌పీఓల కార్యకలాపాలు సహకార సంఘాలకు భిన్నంగా సాగుతాయి.  వీటిని కంపెనీల చట్టం లేదా సహకార చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. ఏడాదికోసారి కార్యవర్గాలను ఎన్నుకునేలా నియమావళిని రూపొందించారు. ఇందులో చేరిన ప్రతి సభ్యుడు వాటాధనం కింద రూ.1000, సభ్యత్వ రుసుం కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ప్రత్యేకంగా ఎరువుల దుకాణం

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలోని లింగంపల్లిలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో కామారెడ్డి జిల్లా అభ్యుదయ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని పన్నెండేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు రుణాలు అందిస్తోంది. పంటఉత్పత్తులు కొనుగోలు చేసి వారికి అండగా నిలుస్తోంది. సభ్యుల వాటాధనంతో ప్రత్యేకంగా ఎరువుల దుకాణం ఏర్పాటు చేశారు.

కస్టమ్స్‌ హైరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు..

ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలం విశ్వనాథపల్లిలో 2018లో ఏర్పాటైన సిరివెన్నెల రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 1500 మంది సభ్యులు ఉన్నారు. రూ.25 లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయంతో కస్టమ్స్‌ హైరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆరు ట్రాక్టర్లు, నాలుగు కల్టివేటర్లు, ఒక రోటావేటరు, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, వరి కట్టలు కట్టే పరికరాలు, తైవాన్‌ స్ప్రేయర్లను మార్కెట్‌ రేటు కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల వ్యాపారం చేస్తూ రెండేళ్లలో రూ.1.90 లక్షల ఆదాయం పొందారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన (బాహేషాన్‌) రైతు ఉత్పత్తిదారుల సంఘంలోనూ దీనికి భాగస్వామ్యం ఉంది. కూరగాయలు, మామిడి, జామ, పుచ్చకాయలు, బొప్పాయిలను పంపిస్తూ లాభాలు పొందుతున్నారు. గతేడాది ఇలా రూ.6 లక్షల వరకు లాభం రావడం విశేషం.

జిన్నింగ్‌ మిల్లు అద్దెకిస్తూ..

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండల గిరిజన రైతులు ‘దాన్‌’ స్వచ్ఛందసంస్థ సహకారంతో 2016లో ‘ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘం’గా ఏర్పడ్డారు. ఇక్కడ 837 మంది సభ్యుల్లో 252 మంది మహిళలే. గతేడాది రూ.5 కోట్లతో జిన్నింగ్‌ మిల్లు ఏర్పాటు చేశారు. యాసంగిలో నెల రోజులు సీసీఐకి అద్దెకివ్వడంద్వారా మిల్లుకు రూ.8 లక్షల ఆదాయం వచ్చింది.

ఔట్‌లెట్లకు కూరగాయలు విక్రయిస్తూ..

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో 500 మంది సభ్యులతో ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(ఐఆర్‌డీఎస్‌) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎఫ్‌పీఓ ముందుకు సాగుతోంది. రూ.30 లక్షల విలువెనౖ ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయించారు. గతేడాదిలో రూ.20 లక్షల విలువైన నిమ్మకాయలు, బత్తాయిలు, కూరగాయలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని ఔట్‌లెట్‌ దుకాణాలకు తరలించారు. సుమారుగా రూ.5 లక్షల లాభాలు ఆర్జించారు. వీరి కార్యకలాపాలకు ఆకర్షితులైన ఎన్‌ఆర్‌ఐ శశి రూ.25 లక్షల చెక్కు అందజేశారు. ఈ మొత్తంతో పండ్లు, కూరగాయల రవాణాకు రెండు ఏసీ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు సీఈవో వై.సైదులు తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడిలో గతేడాది యాసంగిలో 25 మంది రైతులు సంఘంగా ఏర్పడి 25 ఎకరాల్లో దొడ్డురకం విత్తనాలు సాగు చేశారు. వ్యవసాయాధికారుల సూచనలతో పంటను శుభ్రపరచి చిన్నమందడి రైతు సంఘం ముద్రతో 30 కిలోల చొప్పున 400 విత్తన బస్తాలు తయారు చేసి రూ.850 చొప్పున విక్రయించారు. విత్తనోత్పత్తికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం అమ్మపాలెంకు చెందిన ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో కిసాన్‌మార్ట్‌ యాప్‌ తయారు చేసి పలు పంట ఉత్పత్తులను ఇంటింటికి విక్రయిస్తున్నారు. ఖర్చులుపోగా నెలకు రూ.50వేల ఆదాయం వస్తోంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని