రాయితీ విత్తులు అందేనా!

ప్రధానాంశాలు

రాయితీ విత్తులు అందేనా!

ఏ ఒక్క పంటకూ ఇవ్వని వ్యవసాయశాఖ  
టీఎస్‌ సీడ్స్‌ వద్ద ఉన్నవి అరకొరే..
వరి సన్నరకాలకూ ప్రైవేటు కంపెనీలే దిక్కు

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్న యాసంగి సీజన్‌లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాల సరఫరా సవాలుగా మారనుంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వరి 61.75 లక్షల ఎకరాల్లో వేశారు. దాన్ని కోసిన అనంతరం నవంబరు, డిసెంబరులో అంతే విస్తీర్ణంలో రెండో పంట వేయాలి. యాసంగిలో వరి వద్దని ప్రభుత్వం చెబుతున్నందున ప్రత్యామ్నాయంగా ఇతర పంటలకు విత్తనాలేం ఇస్తారు, వాటిపై రాయితీ ఉంటుందో లేదో ప్రకటించలేదు. వేరుసెనగ విత్తనాలపై రాయితీ ఇవ్వడానికి వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం పంపిన ప్రతిపాదనలకు ఇంతవరకూ ప్రభుత్వామోదం లభించలేదు. వచ్చే సీజన్‌లో వరి మానేసి రైతులు ఏపంటలు వేస్తారన్న దానిపై ఈనెల 30వ తేదీ నాటికల్లా వివరాలు సేకరించాలని జిల్లా వ్యవసాయాధికారులను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఈక్రమంలో పంటల విస్తీర్ణం అంచనాలు వచ్చేనెల మొదటివారానికి సిద్ధమవుతాయి. గతంలో యాసంగి సీజన్‌ విత్తనాలను సెప్టెంబరు మూడోవారానికల్లా సిద్ధం చేసి వివరాలు, రాయితీలపై వ్యవసాయశాఖ ఉత్తర్వులిచ్చేది. కానీ ఈ ఏడాది పంటల ప్రణాళికపై ఇంకా స్పష్టతే రాలేదు.

విత్తనాల కొరత

* వరి సన్నరకాల వంగడాలే వేయాలని ప్రభుత్వం చెబుతున్నా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) వద్ద విత్తనాలు లక్ష క్వింటాళ్లకు మించి లేవు. ప్రైవేటు కంపెనీల వద్ద పుష్కలంగా ఉన్నాయి. గతంలో క్వింటా వరి విత్తనాలపై రూ.1000 వరకూ రాయితీ ఇచ్చేవారు. ఈ యాసంగిలో వరి సాగు వద్దని ప్రభుత్వమే చెబుతున్నందున రాయితీపై విత్తనాలచ్చే అవకాశం ఉండకపోవచ్చు.

* వేరుసెనగ సాగు 4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాలకు పెంచాలని అంచనా. ఇందుకు లక్ష క్వింటాళ్ల విత్తనాలు అవసరం. టీఎస్‌ సీడ్స్‌ వద్ద 10 వేల క్వింటాళ్లే ఉన్నాయి. బయటి మార్కెట్‌లో వీటి ధరలు మండిపోతున్నాయి.

* సెనగ విత్తనాలను గతంలో రాయితీపై ఇచ్చేవారు. ఈ సీజన్‌లో అది లేనందున బయటి మార్కెట్‌లోనే రైతులు కొనాలి. టీఎస్‌ సీడ్స్‌ వద్ద 50 వేల క్వింటాళ్లకు మించి లేవు. రాయితీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. రైతులకు వెంటనే పంపిణీ చేసేందుకు.. ముందుగానే టీఎస్‌ సీడ్స్‌.. ప్రైవేటు కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించింది.

* మొక్కజొన్న సాగును గతేడాది ప్రభుత్వం వద్దని చెప్పింది. ఈ యాసంగిలో వరి వద్దని చెబుతున్నందున మొక్కజొన్న వైపు రైతులు ఎక్కువగా వెళ్లే అవకాశాలున్నాయి. ఈ పంట సంకర జాతి విత్తనాలను ప్రైవేటు కంపెనీల నుంచే రైతులు కొనాలి. వ్యవసాయశాఖ వద్ద ఏమీ లేవు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని