ఆహార పరిరక్షణలో 49/100

ప్రధానాంశాలు

ఆహార పరిరక్షణలో 49/100

రాష్ట్రంలో 52 శాతం ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పోస్టులు ఖాళీ
పెద్ద రాష్ట్రాల జాబితాలో 10వ స్థానంలో తెలంగాణ
అగ్రభాగాన గుజరాత్‌, 19వ ర్యాంకులో ఏపీ
2020-21 నివేదికను విడుదల చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తినే తిండి, తాగే నీళ్ల నాణ్యత ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించాల్సిన ‘ఆహార పరిరక్షణాధికారుల(ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌) పోస్టులు రాష్ట్రంలో 52 శాతం ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రాల వారీగా 2020-21 సంవత్సరానికి ‘ఆహార పరిరక్షణ సూచిక’లను ‘భారత ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ విడుదల చేయగా.. ఇందులో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 100 మార్కులకు 49 మార్కులు సాధించి 10వ స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో గుజరాత్‌(72 మార్కులు), కేరళ(70), తమిళనాడు(64) రాష్ట్రాలు తొలి మూడు స్థానాలను సాధించగా.. ఆంధ్రప్రదేశ్‌ 36 మార్కులతో 19వ ర్యాంకులో నిలిచింది.

* మానవ వనరులు, సమాచార సేకరణలో తెలంగాణకు  20 మార్కులకు 9 వచ్చాయి. ఆహార పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. ఏడేళ్లుగా ఈ పోస్టులో వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాకొక ఆహార పరిరక్షణాధికారి ఉండాలనేది నిబంధన. అదికూడా అమల్లో లేదు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో మొత్తం 30 పోస్టులకు 5 ఖాళీలుండగా.. మిగిలిన 32 జిల్లాల్లో 51 ఆహార పరిరక్షణాధికారుల పోస్టులకు ఇంకా 37 ఖాళీలున్నాయి. 

* ఎన్ని నమూనాలు తీస్తాం? ఎన్నింటిని ల్యాబ్‌లకు పంపించాం? వీటన్నింటినీ మార్కుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకుంటారు. మానవ వనరుల కొరత కారణంగా ఆ వేగం మందగించింది. ఇందులో 30 మార్కులకు 11 మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.

* ఆహార పరీక్షలు, మౌలిక సదుపాయాల కేటగిరీలో రాష్ట్రానికి 20కి 14 మార్కులొచ్చాయి. ఇందులో మంచి మార్కులు సాధించడానికి ప్రధాన కారణం. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో అనుమతి పొందిన అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాల అందుబాటులో ఉండటమే.

* శిక్షణ, సామర్థ్యంలో రాష్ట్రం 10 మార్కులకు  6 పొందింది. గతేడాది కొవిడ్‌ కారణంగా శిక్షణలు పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని