ఇల్లు కట్టాలంటే పంచాయితీయే!

ప్రధానాంశాలు

ఇల్లు కట్టాలంటే పంచాయితీయే!

గ్రామాల్లో వారసత్వ హక్కులకు చిక్కులు
అపరిష్కృతంగా భూ సమస్యలు

నల్గొండ జిల్లా చండూరులో నివసించే మురళికి ఇద్దరు తమ్ముళ్లు. వారి ఇల్లు, ఖాళీ జాగా తల్లి పేరుతో ఉన్నాయి. ఆమె మరణించడంతో యాజమాన్య హక్కులను తమ పేరిట మార్చాలని స్థానిక సంస్థ వద్ద గతేడాది దరఖాస్తు చేశారు. అదే సమయంలో ధరణి పోర్టల్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. పంచాయతీలు, పురపాలికల్లో యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియ కూడా నిలిచిపోయింది. అప్పటి నుంచి వారు తమ పని మీద తిరుగుతూనే ఉన్నారు.


మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నివసించే రమేశ్‌ తన తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిలో ఇల్లు కట్టుకున్నారు. దాని సర్వే నంబరు దేవాదాయశాఖ పరిధిలో ఉందంటూ అధికారులు యాజమాన్య హక్కులను తిరస్కరిస్తున్నారు. ఆయన మాదిరే ఎంతోమంది ఇళ్లు కట్టుకుని హక్కుల కోసం తిరుగుతున్నారు. ఇంటి నంబర్లు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు.


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వేల గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలతో ఇళ్లకు అనుమతులు, ఇంటి నంబర్లు రాక యజమానులు అవస్థ పడుతున్నారు. ధరణి పోర్టల్‌ వచ్చినా, వీటికి పరిష్కారం లభించడం లేదు.  రాష్ట్రంలో 31,093 సర్వే నంబర్లలో గ్రామ కంఠం, ఆబాదీ భూములు ఉన్నాయి. గ్రామాల నిర్మాణాలకు కేటాయించిన స్థలాలను ఈ పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. కొన్నిచోట్ల వాటికి ఆనుకుని ఉండే ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవన్నీ పంచాయతీ, పురపాలక సంస్థల దస్త్రాల్లో నమోదై ఉన్నాయి. కాలక్రమంలో గ్రామాలు విస్తరించే కొద్దీ ఈ భూములకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో ఇళ్లు వెలిశాయి. అవీ చేతులు మారుతూ వస్తున్నాయి. అలాంటి భూముల యాజమాన్య హక్కుల సమస్యల్లోనూ ఇబ్బందులు ఉన్నాయి.  గతంలో నివసిస్తున్న భూమికి, ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి కొంత స్పష్టత ఉండగా, ఇంటికి మాత్రమే నంబరు తీసుకుని, పంచాయతీలో నమోదు చేసుకున్న వారు ఇప్పుడు అవస్థ పడుతున్నారు. ఇంటి యజమాని మరణిస్తే వారి వారసులకు ఆ ఇళ్లు, ఖాళీ జాగాపై హక్కులు రావడం లేదు.

ధరణిలోనూ జాప్యమే

నాలా అనుమతులు పొందకుండా గతంలో వ్యవసాయ భూమిలో ఇళ్లు కట్టుకున్న వారికి ప్రస్తుతం భూ యాజమాన్య హక్కులు పొందడం క్లిష్టంగా మారింది. ఆ భూమి ఆబాది లేదా గ్రామ కంఠంలో లేకపోవడంతో స్థానిక సంస్థల దస్త్రాల్లో నమోదు కాలేదు. ఇళ్లు ఉండడం వల్ల అటు సాగు భూమి జాబితాలోనూ లేకుండా పోయింది. సర్వే నంబరు, ఖాతా రెండూ ఆన్‌లైన్‌లో లేకపోవడంతో ఆ విస్తీర్ణం మొత్తం భూ దస్త్రాల్లోకి చేరలేదు. ఇలాంటి భూముల్లో ఇళ్ల నిర్మాణానికి స్థానిక సంస్థలు అనుమతులు జారీ చేయడం లేదు. సాగు భూమిలో ఇల్లు నిర్మించుకున్నంత వరకు నాలాకు అనుమతి ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ధరణిలో ఐచ్ఛికాలు కూడా ఇచ్చింది. అయితే సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో పరిష్కారం కావడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా పరిష్కరిస్తే మేలు

* ప్రభుత్వం ఆస్తుల నమోదు సర్వేలో భూ సమస్యలను గుర్తించి అవి ఏ రకానికి చెందినవో నమోదు చేయాలి.

* దేవాదాయ, ఇతర ప్రభుత్వ రకాలకు చెందిన భూముల్లో నివాసాలు నిర్మించుకున్న చోట్ల ప్రత్యేక అధ్యయనం చేసి పరిష్కరించాలి.

* యాజమాన్య హక్కులు, వారసత్వ బదిలీ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయినచోట తగిన చర్యలు చేపట్టాలి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని