మన చేనేతకు జాతీయ గుర్తింపు

ప్రధానాంశాలు

మన చేనేతకు జాతీయ గుర్తింపు

‘పుట్టపాక తేలియా రుమాల్‌’ చీరకు కేంద్ర పురస్కారం

చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, న్యూస్‌టుడే: పుట్టపాక ‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌ పది నెలలు శ్రమించి మగ్గంపై నేసిన ఈ చీర జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయుల్లో మూడుదశల్లో నిపుణుల బృందాలు పరిశీలించి, వడపోత అనంతరం రూపొందించిన జాబితాలో స్థానం దక్కించుకుంది. చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 2018 ఏడాదిగాను 18 మందిని చేనేత కళాకారుల విభాగంలో ఎంపిక చేసింది. వారిలో తెలంగాణ నుంచి పుట్టపాకకు చెందిన తండ్రీకుమారులు ఉన్నారు. తేలియా రుమాల్‌ చీర తయారీకి నాణ్యమైన పత్తితో తయారైన నూలు ఉపయోగిస్తారు. కరక్కాయ పొడి తదితర ప్రకృతిసిద్ధ పదార్థాలతో దానిని శుద్ధి చేస్తారు. ‘డబుల్‌ ఇక్కత్‌’ అని వ్యవహరించే ‘టై అండ్‌ డై’ పద్ధతిలో డిజైన్లు, కొన్ని చిహ్నాలను ఎంపిక చేసుకుని గ్రాఫ్‌ తయారు చేస్తారు. డిజైన్లు నలు చదరపు గడుల్లో ఇమిడేలా ఏడు గజాల చీర పొడవునా రావడానికి 135 పాయలతో చిటికి తయారు చేస్తారు. అంగుళానికి 72 పోగులు వచ్చేలా చూస్తారు. ఇది ధరిస్తే శరీరానికి వేసవిలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనం ఇస్తుంది.


ఇన్నేళ్ల శ్రమకు గుర్తింపు

మాది చేనేత కుటుంబం. మా నాయన కన్నయ్య కూడా రుమాళ్లు నేసేవాడు. నేను నాలుగో తరగతి వరకు చదువుకుని మగ్గం పనిలో చేరాను. 19 ఏళ్ల వయసులో గుజరాత్‌కు వలసపోయా. అక్కడ కొంత పని నేర్చుకున్నా. ఎలాంటి డిజైన్‌ అయినా గ్రాఫ్‌ తయారు చేస్తా. నా కుమారుడు రవీందర్‌ కూడా చిన్నతనం నుంచే చేనేత పని చేసేవాడు. జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో కొండా లక్ష్మణ్‌ పురస్కారం ఇచ్చి నన్ను గౌరవించింది.

  - కొలను పెద్దవెంకయ్య

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని