వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యమివ్వండి

ప్రధానాంశాలు

వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యమివ్వండి

రైతుసమస్యలకు పరిష్కారం చూపండి
శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌- కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం కనుగొనేందుకు ప్రాధాన్యమివ్వాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువ శాస్త్రవేత్తలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు. ఆయన ఆదివారం ఇక్కడ జరిగిన సీఎస్‌ఐఆర్‌ 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ‘‘వ్యవసాయరంగంతో పాటు, పర్యావరణం, కాలుష్యం, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి అభినందనీయం. కరోనాను ఎదుర్కోవడంలో సీఎస్‌ఐఆర్‌ సహా భారతీయ శాస్త్రవేత్తలు చూపిన చొరవ కారణంగానే దేశం పెనుప్రమాదం నుంచి బయటపడింది. అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో విశ్వమానవాళికి మేలుచేసే మరిన్ని పరిశోధనలపై దృష్టి సారించాలి. ప్రపంచ పరిశోధన రంగంలో భారత్‌ను మొదటిస్థానంలో నిలపాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ యువ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ(సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ)కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ దివ్యతేజ్‌ సౌపతి.. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా యువ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.

* డ్రైస్వాబ్‌ ద్వారా నేరుగా కొవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించే విధానాన్ని కనిపెట్టినందుకు హైదరాబాద్‌ సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు రాకేశ్‌ కుమార్‌ మిశ్ర, టి.కార్తీక్‌ భరద్వాజ్‌, సీజీ గోకులన్‌, సాయ్‌ ఉదయ్‌కిరణ్‌, సంతోష్‌ కె.కుంచా, అర్చన, బి.శివ, దివ్యాసింగ్‌లకు సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రదానం చేశారు.


* కొవాగ్జిన్‌ టీకాలో ఉపయోగించే ఉప ఔషధాన్ని(అడ్జువెంట్‌) తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఎస్‌.చంద్రశేఖర్‌, సీహెచ్‌.రాజిరెడ్డి, ప్రథమ ఎస్‌.మణికర్‌, ఎం.మోహనకృష్ణారెడ్డి, ఎన్‌.జగదీశ్‌బాబు, పున్నా నాగేందర్‌లకూ సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇచ్చారు. వీరిలో ఎస్‌.చంద్రశేఖర్‌ సీఎస్‌ఐఆర్‌ టెక్నాలజీ అవార్డుకు ఎంపికవడం ఇది వరుసగా రెండోసారి. 2020వ సంవత్సరంలోనూ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


అన్నదాతకు షడ్భుజి సాయం..

దుక్కి దున్నడం, చదును చేయడం, వరి కోయడం, వ్యవసాయ వ్యర్థాలను తొలగించడం.. ఇలా వేర్వేరు పనులను ఒకే యంత్రంతో చేయొచ్చని కరీంనగర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు నిరూపించారు. పద్మనగర్‌ పారమిత హెరిటేజ్‌ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న గుర్రం అనుదీప్‌, సయ్యద్‌ మెహతాబ్‌లు.. టీచర్‌ లలిత్‌మోహన్‌ సాహు పర్యవేక్షణలో 2018లో మ్యాజికల్‌ హెక్సాగాన్‌ (గణిత మాయా షడ్భుజి) రూపొందించారు. తద్వారా సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) 2021వ సంవత్సరానికి నిర్వహించిన జాతీయస్థాయి నవ్యావిష్కరణ పోటీల్లో మొదటి బహుమతి సాధించి ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2018లో జిల్లా, రాష్ట్ర, దక్షిణ భారత, జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌, సీఎస్‌ఐఆర్‌ పోటీల్లో వరసగా మ్యాజికల్‌ హెక్సాగాన్‌ ప్రథమ స్థానం పొందింది. సీఎస్‌ఐఆర్‌ జాతీయస్థాయి ఇన్నోవేషన్‌ పోటీల్లో 15 లక్షల పాఠశాలలను వెనక్కి నెట్టి తెలంగాణ తరఫున ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. యంత్రాన్ని భారతీయ వరి పరిశోధన సంస్థకు తీసుకెళ్లగా సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.ఆర్‌. వోలేటి యంత్ర సామర్థ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్‌ ఇచ్చారు.

రైతులకు ఉపయోగకరం: అనుదీప్‌, మెహతాబ్‌

మాయా షడ్భుజి యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరం. ద్విచక్రవాహన ఇంజిన్‌, పెట్రోలు ట్యాంకు, స్టేబుల్‌ కట్టర్‌, చక్రాలు, గణిత సూత్రాలను ఉపయోగించి రూపొందించాం. యంత్రం తయారీకి రూ.20 వేలు ఖర్చయింది. యంత్రానికి పేటెంట్‌ పొంది మరింత అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని