ఇంటర్‌ విద్యార్థుల్లో ప్రథమ పరీక్షల టెన్షన్‌

ప్రధానాంశాలు

ఇంటర్‌ విద్యార్థుల్లో ప్రథమ పరీక్షల టెన్షన్‌

మొదటి సంవత్సరం పుస్తకాలు తీస్తున్న ద్వితీయ విద్యార్థులు
పునశ్చరణ తరగతులు మొదలుపెడుతున్న కళాశాలలు
ద్వితీయ ఇంటర్‌కు నెలన్నర విరామం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రథమ ఇంటర్‌ పరీక్షల టెన్షన్‌ వెంటాడుతోంది. ఫస్టియర్‌ పరీక్షలు తప్పకుండా ఉంటాయని ఆగస్టు చివరి వారంలోనే ప్రకటించిన ప్రభుత్వం త్వరలో కాలపట్టిక ఇస్తామని నెల రోజులపాటు నాన్చింది. చివరకు అక్టోబరు 25 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఫలితంగా ఇప్పటివరకు ద్వితీయ ఇంటర్‌ పాఠ్యాంశాలు చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు ప్రథమ ఇంటర్‌ పుస్తకాలను తీస్తున్నారు. ఏప్రిల్‌లోనే ఫస్టియర్‌ పుస్తకాలను పక్కనబెట్టిన విద్యార్థులు ఇప్పుడు మళ్లీ వాటిని చదువుకోవాల్సి వస్తుండటంతో ఎంత వరకు గుర్తుంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ద్వితీయ తరగతులు నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తుండటంతో ప్రైవేట్‌ కళాశాలలు ఇంటర్‌ పాఠ్యాంశాల పునశ్చరణ మొదలుపెట్టాలని నిర్ణయించాయి. సర్కారు జూనియర్‌ కళాశాలల్లోనూ ఫస్టియర్‌ తరగతులు పునశ్చరణ చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఓ అధ్యాపకుడు చెప్పారు. సెకండియర్‌ తరగతులకు రాలేమని కొందరు చెబుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పరీక్షలు ముగిశాక 10-15 రోజులపాటు జవాబుపత్రాల మూల్యాంకనానికి అధ్యాపకులు వెళ్లాలి. అప్పుడు కూడా తరగతులు తూతూమంత్రంగా జరగనున్నాయి. ఫలితంగా నెలన్నరపాటు ద్వితీయ తరగతులు లేనట్లేనని స్పష్టమవుతోంది. ఒకవేళ పరీక్షలు పెట్టాలని భావించినప్పుడు దసరా సెలవుల లోపు పూర్తి చేస్తే కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు తమకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, ఆదాయపు పన్ను కోత లేకుండా ఇవ్వకుంటే పరీక్షల విధులను బహిష్కరిస్తామని ఒప్పంద అధ్యాపకుల సంఘం ఒక ప్రకటనలో హెచ్చరించింది. పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి కోరింది.


పరీక్ష విధానంపై ఏదీ స్పష్టత?

రీక్ష ప్రశ్నపత్రంపైనా ఇంటర్‌బోర్డు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ప్రకటించినట్లుగా 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తామని తెలిపింది. గతంలో ప్రథమ, ద్వితీయ పరీక్షలు ఉండడంతో రోజు మార్చి రోజు నిర్వహించేవారు. ఇప్పుడు ప్రతిరోజూ పరీక్షలు ఉండేలా కాలపట్టికను ప్రకటించారు. అది కూడా విద్యార్థులను కలవరపెడుతోంది. అయితే పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుపుతామని బోర్డు వెల్లడించడంతో గతంలో మాదిరిగా 3 గంటలపాటు పరీక్ష ఉంటుందని తెలుస్తోంది. మే నెలలో జరగాల్సిన పరీక్షల్లో ఛాయిస్‌ను పెంచుతామని ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆ విషయాన్ని వెల్లడించలేదు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ప్రథమ సంవత్సర పరీక్షలు రాయనున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని