రామోజీ ఫిలింసిటీతో పర్యాటక రంగమే మారింది

ప్రధానాంశాలు

రామోజీ ఫిలింసిటీతో పర్యాటక రంగమే మారింది

టూరిజం సిబ్బంది అక్కడ శిక్షణ తీసుకోవాలి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్య
పర్యాటక పురస్కారాల ప్రదానం

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ ఫిలింసిటీ రాకతో రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు వచ్చిందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నగరంలోని హరిత ప్లాజాలో సోమవారం నిర్వహించిన పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రంగంలో ఉత్తమ సేవలందించిన సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేశారు. పర్యాటక సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించట్లేదని.. నిర్వహణ ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలు ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైనా, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో గొప్ప మార్పు వచ్చిందని వివరించారు. తెలుగు సినిమాల్లో హైదరాబాద్‌ అనగానే సైబర్‌ టవర్స్‌, హైటెక్‌సిటీని మాత్రమే చూపిస్తున్నారని.. గోల్కొండ వంటి చారిత్రక వైభవాల ముందు అవి చాలా చిన్నవని మంత్రి అనారు. కొత్త పర్యాటక విధానం ద్వారా పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.

* 2020 ఏడాదికి 5 స్టార్‌ విభాగంలో తాజ్‌ఫలక్‌నుమా హోటల్‌, 4 స్టార్‌ విభాగంలో గోల్కొండ హోటల్‌, డాల్ఫిన్‌ గ్రూపునకు చెందిన సితార హోటళ్లు, ఆలంకృత రిసార్టులకు మంత్రి పురస్కారాలందించారు. ఉత్తమ వసతుల్లో వనపర్తి ఓపీడీఎస్‌ఎస్‌ హోటల్‌, నార్కట్‌పల్లి వివేరా, ఉత్తమ పర్యాటక నిర్వహణలో ఆర్‌వీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, ఉత్తమ ట్రావెల్స్‌లో సదరన్‌, ఉత్తమ రెస్టారెంట్‌గా 7 ఫుడ్‌ కోర్టు పురస్కారాలందుకున్నాయి.

* 2021కి ఉత్తమ పౌర నిర్వహణలో రామోజీ ఫిలింసిటీ, 5 స్టార్‌ హోటళ్లలో వెస్టిన్‌, పార్క్‌హయత్‌, గోల్కొండ రిసార్ట్స్‌, 4 స్టార్‌లో దసపల్లా, మృగవని రిసార్ట్స్‌, 3 స్టార్‌లో అశోక పురస్కారాలందుకున్నాయి. ఉత్తమ థీమ్‌ రిసార్ట్‌లో పామ్‌ ఎక్సోటికా, ఉత్తమ రెస్టారెంట్‌గా ఓహ్రీస్‌ సాహిబ్‌ బీబీక్యూ, కరీంనగర్‌ తారక, మహబూబ్‌నగర్‌ ప్రశాంత్‌ హోటల్‌; ఉత్తమ కన్వెన్షన్‌ సెంటర్‌గా నోవాటెల్‌, ఉత్తమ హరిత హోటళ్లుగా తారామతి బారాదరి కాంప్లెక్స్‌, రామప్ప హరిత హోటల్‌, అలీసాగర్‌ లేక్‌వ్యూ రిసార్టులు; ఉత్తమ టూర్‌ ఆపరేటర్‌గా గరుడ టూరిజం పురస్కారాలను అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాసగుప్తా, ఎండీ మనోహర్‌, పర్యాటకశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


అక్టోబరు 8 నుంచి రామోజీ ఫిలిం సిటీ పునఃప్రారంభం
- వెంకటరత్నం ఫిలింసిటీ వైస్‌ప్రెసిడెంట్‌; టీఆర్‌ఎల్‌ రావు జీఎం, డాల్ఫిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు సేవలందించడం వల్లే ఈ పురస్కారాలు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు మొదట రామోజీ ఫిలింసిటీనే సందర్శిస్తున్నారు. అక్టోబరు 8 నుంచి ఫిలింసిటీని తిరిగి ప్రారంభిస్తున్నాం. కొవిడ్‌ జాగ్రత్తల నడుమ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని