1 లోగా మధ్యంతర నివేదికలివ్వండి

ప్రధానాంశాలు

1 లోగా మధ్యంతర నివేదికలివ్వండి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నివేదిక సమర్పణలో కేంద్ర పర్యావరణశాఖ నాన్చుడు ధోరణిపై చెన్నై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అసహనం వ్యక్తం చేసింది. ఈ కాలయాపన సరికాదని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. జులైలో నోటీసులిచ్చినా ఇప్పటి వరకు స్పందించకపోవడం నిర్హేతుకమని పేర్కొంది. అక్టోబరు ఒకటోతేదీ కల్లా మధ్యంతర నివేదికలు సమర్పించాలంటూ కేంద్ర పర్యావరణశాఖతోపాటు కృష్ణానదీ యాజమాన్య బోర్డ్(కేఆర్‌ఎంబీ)లకు ఆదేశాలు జారీచేసింది. అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందంటూ ఏపీకి చెందిన రైతు చంద్రమౌళీశ్వరరెడ్డిసహా మరికొందరు అన్నదాతలు.. ఈ ప్రాజెక్టు కోసం అనుమతుల్లేకుండా మైనింగ్‌ చేపడుతున్నారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన కె.వెంకటయ్య వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం విదితమే.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబరులోగా పనులను పూర్తిచేసేందుకు యుద్ధప్రాతిపదికన ముందుకుసాగుతున్నందున అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ చంద్రమౌళీశ్వరరెడ్డి పిటిషన్‌లో కోరారు. దీనిపై సోమవారం ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత ధర్మాసనం సత్వరం విచారణ చేపట్టాలన్న ఏపీ రైతుల పిటిషన్‌ను అనుమతిస్తూ విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా మధ్యంతర నివేదికలను సమర్పించాలంటూ కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖలను ఆదేశించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని