టీకా రెండు డోసులు తప్పనిసరి

ప్రధానాంశాలు

టీకా రెండు డోసులు తప్పనిసరి

అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కోరతాం
కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో కోడ్‌ అమల్లోకి
తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌

ఈనాడు, హైదరాబాద్‌: అభ్యర్థులు, ఏజెంట్లు, పార్టీల కార్యకర్తలు అందరూ కరోనా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలని, వ్యాక్సిన్‌ పూర్తయిన సిబ్బందిని మాత్రమే ఎన్నికల విధుల్లో నియమిస్తామని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ స్పష్టంచేశారు. హుజూరాబాద్‌లోని అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ నేపథ్యంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. హుజూరాబాద్‌ నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండటమే ఇందుకు కారణం. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలను గుర్తించాం. 610 చొప్పున బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్స్‌ తనిఖీ చేశాం. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య మేరకు అవసరమైతే అదనపు ఈవీఎంలను సిద్ధం చేస్తాం. 305 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వెయ్యి కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న 47 చోట్ల అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.  

మహిళా ఓటర్లే ఎక్కువ

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2,36,430 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,18,725 మంది మహిళలు, 1,17,704 మంది పురుషులు, ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. 18-19 సంవత్సరాల ఓటర్లు 4,988 మంది, 80 సంవత్సరాలు దాటిన వారు 4,454 మంది, దివ్యాంగులు 8,139 మంది ఉన్నారు. దివ్యాంగులు, కరోనా పాజిటివ్‌ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉంటుంది. శాసన మండలిలోని ఆరు స్థానాల భర్తీపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్ల దాఖలుకు 10 రోజుల ముందు వరకు నమోదు చేసుకున్నవారిలో అర్హులందరికీ ఓటు హక్కు ఉంటుంది’ అని శశాంక్‌ గోయల్‌ వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని