Heavy Rains: కన్నీటి పంట

ప్రధానాంశాలు

Heavy Rains: కన్నీటి పంట

కుంభవృష్టితో వేల ఎకరాలు నీటమునక

పంటలు నీటమునిగి రైతుకు కన్నీళ్లే దిగుబడి

పత్తి, సోయా, మక్క, వరి, కంది తదితర పంటలకు అధిక నష్టం

నాలుగు నెలల్లో నాలుగోసారి 

పంటల బీమా లేకపోవడంతో సాయం అందడం అనుమానమే

వివరాలు వెల్లడించని వ్యవసాయశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: కుంభవృష్టి కర్షకులకు కన్నీళ్లను మిగిల్చింది. మూడు రోజులుగా భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇరవై రోజుల క్రితమూ అతి భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. గత జూన్‌లో ప్రారంభమైన వానాకాలం సీజన్‌ రేపటి (సెప్టెంబరు 30)తో ముగుస్తోంది. జూన్‌ చివర్లో, జులై, ఆగస్టు, సెప్టెంబరు.. ఇలా ప్రతి నెలా కనీసం వారం, పది రోజులు భారీ వర్షాలు రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో పంటలను నష్టపరిచాయి. వర్షాలకు దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు జిల్లాస్థాయి అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో గత జూన్‌ నుంచి ఇప్పటివరకు 10 లక్షల ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని అనధికార అంచనా. కానీ, ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పెద్దగా దెబ్బతినలేదని.. పొలాల నుంచి నీరు బయటికి వెళ్లిన తర్వాత కోలుకున్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది.

గతంలో అధ్యయనం చేయని వ్యవసాయశాఖ

కుంభవృష్టితో పంటలు నీట మునిగినా రెండు, మూడు రోజుల తరవాత నీరంతా వెళ్లిపోయాక క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాలుంటే వివరాలు పంపాలని వ్యవసాయశాఖ సూచించిందని ఓ జిల్లా వ్యవసాయాధికారి ‘ఈనాడు’కు తెలిపారు. ఎకరంలో కనీసం 33 శాతం దెబ్బతింటే నీరంతా వెళ్లిపోయాక పరిశీలించి నిర్ణయిస్తామని వివరించారు. గత జులై, ఆగస్టు నెలల్లో, ఈ నెలారంభంలోనూ అధిక వర్షాలతో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినా వ్యవసాయశాఖ ఎలాంటి అధ్యయనం చేయలేదు. ఎన్ని ఎకరాల్లో నీటమునిగాయో వివరాలు వెల్లడించలేదు. పంట నష్టాలపై పరిహారం ఇవ్వడానికి గతేడాది ఎలాంటి లెక్కలు అడగలేదని, అందుకే ఈసారి వాటిపై దృష్టి పెట్టలేదని సీనియర్‌ వ్యవసాయాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. తాజా వర్షాలకు ఎన్ని ఎకరాల్లో పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ కమిషనర్‌, కార్యదర్శి రఘునందన్‌రావును ‘ఈనాడు’ సంప్రదించగా సమాధానం ఇవ్వలేదు.

సాధారణం కన్నా 134 శాతం అదనపు వర్షపాతం

సాధారణం కన్నా 20 శాతానికి మించి వర్షాలు కురిస్తే అధిక వర్షపాతం ఉన్న జిల్లాలుగా వాతావరణశాఖ గుర్తిస్తుంది. రాష్ట్రంలో 33కి గాను 26 జిల్లాల్లో సాధారణం కన్నా 20 నుంచి 134 శాతం అదనపు వర్షపాతం నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత జూన్‌ 1 నుంచి మంగళవారం వరకూ 134 శాతం, యాదాద్రిలో 99, సిద్దిపేటలో 81, కరీంనగర్‌లో 78, మహబూబాబాద్‌లో 77, హన్మకొండ, నిర్మల్‌లో 74 శాతం అదనంగా వర్షాలు కురిశాయి.

కొద్ది గంటల్లోనే ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో పంటలు నేలవాలి వరదలో కొట్టుకుపోతున్నాయి. సోమవారం పగలు నిజామాబాద్‌ జిల్లాలో పెద్దగా వర్షం లేదు. రాత్రి ఒక్కసారిగా ప్రారంభమై తెల్లారేసరికల్లా 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 10,946 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు  అంచనా.

సంగారెడ్డి జిల్లాలో 99,865 ఎకరాల పంటలు నీటమునిగాయి. ఇందులో పత్తి 71,235 ఎకరాలు, సోయాచిక్కుడు 12,241, కంది 7,168 ఎకరాలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి, సోయా పంటలకు నష్టం ఎక్కువగా ఉంది. ములుగు జిల్లాలో 100 ఎకరాలు, జయశంకర్‌ జిల్లా మల్హర్‌ మండలం మల్లారం గ్రామంలో 200 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఖమ్మం జిల్లాలో ఇటీవల నాటిన మిరప మొక్కలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. పత్తి నేలకొరిగింది. పొట్టదశలో ఉన్న వరి పొలాలు నీట మునిగాయి.


ఈ వరద కింద పంటలున్నాయి

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం హంగర్గ, బిక్నెల్లి, ఖండ్‌గావ్‌ ప్రాంతంలోని ఈ వరద నీటిలో 1500 ఎకరాల పైర్లు మునిగి ఉన్నాయి. గోదావరి, హరిద్ర, మంజీర నదులు కలిసే ప్రాంతం సమీపంలో వరద నీరు వెనక్కి వచ్చి పరిసర గ్రామాల్లోని వరి, సోయా, పొగాకు, పత్తి పంటలు ముంపునకు గురయ్యాయి. ఇదే ప్రాంతంలో గత నెలలో కురిసిన వర్షాలకూ పంటలు నీటమునిగాయి.


భోరుమన్న రైతన్న

ప్రకృతి ప్రకోపం ఓ రైతును భోరున విలపించేలా చేసింది. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం మామిడిగూడకు చెందిన కుంట నర్సింగ్‌ నాలుగెకరాల పొలంలో పత్తి వేశారు. వర్షానికి పంట పూర్తిగా నీట మునిగింది. పైరంతా నేలవాలింది. మంగళవారం పంటల పరిశీలనకు భాజపా నేతలు రాగా.. పెట్టుబడి కోసం చేసిన రూ.4 లక్షలు ఎలా తీర్చాలంటూ రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటంతా నేలపాలైందని నర్సింగ్‌ కంటతడి పెట్టారు. ఇక ఎలా బతికేదంటూ రోదించారు.

-ఈటీవీ, ఆదిలాబాద్‌


సగం పంట నాశనం
- సంజీవ్‌రెడ్డి, పస్తాపూర్‌, సంగారెడ్డి జిల్లా

10 ఎకరాల్లో సోయా సాగు చేస్తే సగానికి సగం నాశనమైంది. ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. 5 ఎకరాల్లో రూ. 1.75 లక్షల విలువైన పంట దెబ్బతిని అప్పులే మిగిలాయి.


రూ.80 వేల నష్టం
- కోట లింగయ్య, వరి రైతు, మల్లారం గ్రామం, జయశంకర్‌ జిల్లా

2.40 ఎకరాల్లో వరి వేశాను. వర్షాలకు వాగు నీటితో పంటంతా మునిగింది. గత నెలలోనూ ఒకసారి ఇలా జరిగింది. ఇప్పటికే రూ.80 వేల పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వమే ఆదుకోవాలి.


 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని