తెలంగాణలో తగ్గిన నిబంధనల భారం

ప్రధానాంశాలు

తెలంగాణలో తగ్గిన నిబంధనల భారం

వ్యాపార వాతావరణాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సరళం చేసింది
కేంద్ర వాణిజ్యశాఖ నివేదిక వెల్లడి

ఈనాడు, దిల్లీ: లైసెన్సులు, క్లియరెన్సులు, సర్టిఫికెట్ల జారీని తెలంగాణ ప్రభుత్వం వేగవంతంచేసి వ్యాపారాల ప్రారంభం, నిర్వహణను సులభతరంగా మార్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ‘ఏ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ రిడక్షన్‌ ఆఫ్‌ కంప్లయన్స్‌ బర్డన్‌’ నివేదిక ఈ అంశాన్ని పేర్కొంది. పీయూష్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 22 వేల నిబంధనలను తొలగించినట్లు చెప్పారు. ‘‘మొత్తం 103 అపరాధాలను నేరాల పరిధిలోంచి తప్పించాం. 327 నిరుపయోగ నిబంధనలు, చట్టాలను రద్దుచేశాం. వ్యాపార యాజమాన్యాల విశ్వాసాన్ని పెంపొందించేందుకే నిబంధనల భారాన్ని తగ్గించాం’’ అని తెలిపారు. మంత్రి విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో సరళీకృత వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది.

ముఖ్యాంశాలు ఇలా...

వివిధ చట్టాల కింద ప్రభుత్వ సంస్థలు జారీచేసే ధ్రువీకరణ పత్రాలను భౌతిక రూపంలో చూపాల్సిన నిబంధనలను తొలగించారు. డిజిటల్‌ సర్టిఫికెట్లు చూపే వీలు కల్పించారు.

18 రిజిష్టర్లు, రికార్డుల నిబంధలను సరళీకృతంచేసి వాటిని ఎలక్ట్రానిక్‌ రూపంలో నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు.

45 సర్టిఫికెట్లకోసం దరఖాస్తు చేసుకొనే విధానాన్నీ, వాటి జారీని సులభతరం చేశారు. ఇంటర్‌స్టేట్‌ మైగ్రెంట్‌ వర్క్‌మెన్‌ యాక్ట్‌ 1979, మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యాక్ట్‌ 1961 కింద ఆన్‌లైన్‌ లైసెన్సులను ఆటో రెన్యువల్‌ చేసుకొనే విధానాన్ని ప్రవేశపెట్టారు.

సంస్కరణల కారణంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగం పుంజుకొంది.

లీగల్‌ మెట్రాలజీ శాఖ కింద అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌లోకి తెచ్చారు. లైసెన్స్‌ రెన్యువల్‌ సమయాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచారు. అలాగే డిపాజిట్‌ మొత్తాన్ని 50 శాతానికి తగ్గించారు.

విద్యుత్‌ శాఖ రిటర్న్స్‌ దాఖలు చేయాల్సిన సమయాన్ని ప్రతి నెలకు బదులు ఏడాదికి పెంచారు.

ఆయుధ లైసెన్సులు తీసుకోవడం, పునరుద్ధరించుకోవడాన్ని ఆన్‌లైన్‌లోకి మార్చారు. దానివల్ల లైసెన్సు కాలపరిమితి ముగిసినప్పుడు మళ్లీ అన్ని డాక్యుమెంట్లూ భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేకుండా పోయింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని